అచ్చొచ్చిన మైదానంలో మనవాళ్లు సత్తాచాటి మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంటారనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా పేలవ ప్రదర్శన కనబర్చారు. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిషెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులకు మనవాళ్లు క్రీజులో నిలువలేకపోయారు. వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగుతుందో లేదో అనుకున్న అభిమానులు.. టీమ్ఇండియా బ్యాటింగ్ చూశాక.. వరుణుడు కరుణించి మ్యాచ్‌ను తుడిచిపెట్టేస్తే బాగుండు అనుకున్నారంటే అతిశయోక్తి కాదు! పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు ఒకరి వెంట ఒకరు డగౌట్‌కు క్యూ కట్టగా.. మార్ష్, హెడ్ దంచికొట్టడంతో కంగరూలు వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఊదేశారు!
విశాఖపట్నం: నాణ్యమైన పేస్‌కు టీమ్ఇండియా దాసోహం అంది. మబ్బులు కమ్మిన వాతావరణంలో కంగారూ పేసర్ మిషెల్ స్టార్క్ బంతులు బుల్లెట్లను తలపించగా.. మనవాళ్లు వాటిని ఎదుర్కోలేక మ్యాచ్‌ను అప్పగించేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. వర్ష సూచన మధ్య ప్రారంభమైన రెండో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. గత రెండు దశాబ్దాల్లో ఆసీస్‌పై టీమ్ఇండియాకు ఇది అత్యల్ప స్కోరు. విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్ కాగా.. అక్షర్ పటేల్ (29 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ (5/53) ధాటికి టీమ్ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (0), కెప్టెన్ రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (0), కేఎల్ రాహుల్ (9), హార్దిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో అబాట్ 3, ఎలీస్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టారు. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే బుధవారం చెన్నైలో జరుగనుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. అచ్చం గత వన్డేలోలాగే టాపార్డర్ మరోసారి నిరాశ పరిచింది. తొలి ఓవర్ మూడో బంతికే గిల్ ఔట్ కాగా.. ఐదో ఓవర్లో టీమ్ఇండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి వన్డేకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్.. స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇవ్వగా.. ముంబై మ్యాచ్ తరహాలోనే సూర్యకుమార్ మరోసారి సున్నా చుట్టాడు. ఈ సారి కూడా స్టార్క్ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తొలి వన్డే హీరో కేఎల్ రాహుల్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్లాడు. దీంతో రోహిత్ సేన 49 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా.. తనకు బాగా కలిసొచ్చిన వైజాగ్ స్టేడియంలో కోహ్లీ పోరాటం కొనసాగించాడు. విరాట్ అండతో టీమ్ఇండియా పోరాడే స్కోరైనా చేస్తుందనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. ఎలీస్ బౌలింగ్‌లో కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోగా.. జడేజా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ బ్యాట్‌కు పనిచెప్పడంతో భారత జట్టు వంద పరుగుల మార్క్‌ను దాటగలిగింది. మ్యాచ్‌కు ముందు రోజు వైజాగ్‌లో భారీ వర్షం కురియడంతో పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాచిక పారింది. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన స్టార్క్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు.
హార్దిక్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ కెప్టెన్ స్మిత్ నమ్మశక్యం కాని విధంగా అందుకున్నాడు. అబాట్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఆప్స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని పాండ్యా కట్ చేయబోగా.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ కండ్లు చెదిరే రితిలో క్యాచ్ అందుకున్నాడు. పక్షిలా కుడి వైపు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో రెప్పపాటులో బంతిని ఒడిసి పట్టాడు. ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ అనుకోవడం లేదు కానీ, హార్దిక్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో ఆనందమేసింది’ అని అన్నాడు.
1 వన్డేల్లో బంతుల తేడా పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద పరాజయం.
2 ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్‌కు ఇది రెండోసారి.
4 స్వదేశంలో భారత్‌కు ఇది నాలుగో అత్యల్ప వన్డే స్కోరు కాగా.. ఆస్ట్రేలియాపై మూడోది.
భారత్: 26 ఓవర్లలో 117 ఆలౌట్ (కోహ్లీ 31, అక్షర్ 29 నాటౌట్; స్టార్క్ 5/53, అబాట్ 3/23),
ఆస్ట్రేలియా: 11 ఓవర్లలో 121/0 (హెడ్ 52 నాటౌట్, మార్ష్ 66 నాటౌట్).