Team India | షమీ చురకత్తుల్లాంటి బంతులతో కంగారూలను చీల్చి చెండాడితే.. నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో భారత్‌ను సునాయాసంగా విజయ తీరాలకు చేర్చారు. భారీ స్కోర్లకు వేదికైన మొహాలీ పిచ్‌పై ఆసీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత బ్యాటర్లు సమిష్టిగా సత్తాచాటారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టడంతో పాటు అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
మొహాలీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్.. వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు ఆస్ట్రేలియాపై సాధికారిక విజయం నమోదు చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం పర్వత సానువుల్లో జరిగిన పోరులో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసి 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయ్యారు. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. స్టీవ్ స్మిత్ (41), లబుషేన్ (39), కామెరూన్ గ్రీన్ (31), ఇంగ్లిస్ (45), స్టొయినిస్ (29) రాణించారు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లతో సత్తాచాటాడు. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది.
ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (74; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (71; 10 ఫోర్లు), స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధశతకాలతో దుమ్మురేపారు. ఆసీస్ బౌలర్లలో జంపా 2 వికెట్లు పడగొట్టాడు. షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే జరుగనుంది. వచ్చే నెల 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్ నుంచి ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వగా.. అవకాశం వచ్చిన యువ ఆటగాళ్లు దాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నారు. మొదట బౌలింగ్‌లో షమీ నిప్పులు చెరిగితే.. ఆనక బ్యాటింగ్‌లో అయ్యర్ (3) మినహా తక్కినవాళ్లంతా బాధ్యతాయుతంగా ఆడారు. తన తొలి ఓవర్లోనే మిషెల్ మార్ష్‌ను (4)ను ఔట్ చేసిన షమీ.. ఆ తర్వాత స్మిత్, స్టోయినిస్, షార్ట్ (2), అబాట్ (2)ను పెవిలియన్ బాట పట్టించాడు. గతంలో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లతో పోల్చుకుంటే.. ఈసారి కంగారూలు తక్కువ పరుగులే చేయగా.. బ్యాటింగ్‌లో భారత్‌కు ఓపెనర్లు గట్టి పునాది వేశారు. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న గిల్, గైక్వాడ్ జోడీ.. తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించి మెరుగైన ఆరంభం అందించగా.. మిగిలిన పని రాహుల్, సూర్యకుమార్ పూర్తి చేశారు.
1 వన్డేల్లో షమీకి ఇవే అత్యుత్తమ గణాంకాలు (5/51) కాగా.. అతడికిది రెండో ఐదు వికెట్ల ప్రదర్శన.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 276 ఆలౌట్ (వార్నర్ 52, ఇంగ్లిస్ 45; షమీ 5/51, బుమ్రా 1/43), భారత్: 48.4 ఓవర్లలో 281/5 (గిల్ 74, గైక్వాడ్ 71; జంపా 2/57).