INDvsSA: టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టులలో అరంగేట్రం చేసి ఐదేండ్లు కావస్తోంది. 2018లో బుమ్రా.. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఎంట్రీ ఇచ్చి నాలుగు వికెట్టు తీశాడు. సరిగ్గా ఐదేండ్ల తర్వాత బుమ్రా కేప్‌టౌన్‌లో మరో అరుదైన ఘనతను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జనవరి 3 నుంచి మొదలుకాబోయే రెండో టెస్టులో బుమ్రా ఆరు వికెట్లు తీస్తే ఈ వేదికపై అత్యధిక వికెట్లు తీసిన యాక్టివ్ బౌలర్లలో అగ్రస్థానానికి చేరతాడు.
కేప్‌టౌన్‌లో బుమ్రా ఇప్పటివరకూ రెండు టెస్టులు ఆడి పది వికెట్లు పడగొట్టాడు. ఈ వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లలో ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్.. 16 వికెట్లతో అగ్రస్థానం (యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో) లో ఉన్నాడు. రెండో టెస్టులో గనక బుమ్రా ఏడు వికెట్లు పడగొడితే అతడు అండర్సన్‌ను అధిగమిస్తాడు. అంతేగాక ఏడు వికెట్లు తీస్తే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ (17 వికెట్ల) రికార్డును సమం చేస్తాడు. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్లలో ఇంగ్లండ్ బౌలర్ కొలిన్ బ్లిత్ 25 వికెట్లతో ముందువరుసలో ఉన్నాడు.
భారత్ నుంచి కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (12 వికెట్లు), అనిల్ కుంబ్లే (11) లు తొలి రెండు స్థానాలలో ఉన్నారు. కేప్‌టౌన్‌లో మూడు వికెట్లు పడగొట్టినా శ్రీనాథ్ 27 ఏండ్ల రికార్డు బద్దలవనుంది. మరి బుమ్రా కేప్‌టౌన్‌లో ఏం చేసేనో…!
2018లో టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటివరకూ 31 టెస్టులు ఆడాడు. టెస్టులలో 21.84 సగటుతో 132 వికెట్లు పడగొట్టాడు. వన్డే ఫార్మాట్లో 89 మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు తీశాడు. 62 టీ20లలో 74 వికెట్లు సాధించాడు.