Yashasvi Jaiswal | టీమిండియా బ్యాటింగ్ సంచలనం, ముంబై కుర్రాడు యశస్వీ జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరవిహారం చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో అతడు దిగ్గజాలు నెలకొల్పిన రికార్డులను అవలీలగా బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన జైస్వాల్.. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో ఫిఫ్టీ (57) చేశాడు. అర్థ సెంచరీ చేసే క్రమంలో జైస్వాల్.. ఐదు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. తద్వారా జైస్వాల్.. టెస్టులలో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ చేయడం ద్వారా జైస్వాల్ నెలకొల్పిన రికార్డుల జాబితా కింది విధంగా ఉంది.
ఫాస్టెస్ట్ థౌజండ్..
టెస్టులలో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన వారిలో జైస్వాల్ రెండోవాడు. 9 వ టెస్టు ఆడుతున్న జైస్వాల్.. 16 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకోగా వినోద్ కాంబ్లీ.. 12 టెస్టులలో 14 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు పూర్తిచేశాడు. జైస్వాల్.. పుజారా (18 ఇన్నింగ్స్), మయాంక్ అగర్వాల్ (19), సునీల్ గవాస్కర్ (11 టెస్టులు, 21 ఇన్నింగ్స్) రికార్డులను బ్రేక్ చేశాడు. ఓపెనర్‌గా మాత్రం జైస్వాల్‌దే రికార్డు. రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఓపెనర్‌గా ఉన్నాడు.
కోహ్లీని వెనక్కి నెట్టి..
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బషీర్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో జైస్వాల్ ఈ సిరీస్‌లో 700 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఒక సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు కలిగిన కోహ్లీని అధిగమించాడు. కోహ్లీ.. 2014-15లో ఇంగ్లండ్‌పై 692 రన్స్ చేయగా తాజాగా జైస్వాల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో భారత్ తరఫున సునీల్ గవాస్కర్ ముందున్నాడు. 1971లో గవాస్కర్ వెస్టిండీస్ సిరీస్‌లో 774 రన్స్ చేశాడు. 1978/79లోనూ అదే విండీస్‌పై 732 రన్స్ సాధించాడు. మూడో స్థానంలో జైస్వాల్.. 712 రన్స్‌తో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమొచ్చి మరో 63 పరుగులు చేయగలిగితే గవాస్కర్ రికార్డు బ్రేక్ అవడం ఖాయం.
సచిన్ సిక్సర్ల రికార్డు..
తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్.. బషీర్ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్.. ఇంగ్లండ్ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 టెస్టులు కొట్టగా తాజాగా యశస్వీ.. అదే ఇంగ్లీష్ టీమ్‌పై 26 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికాపై రోహిత్ శర్మకు 20 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లున్నాయి.
9 టెస్టులలోనే..
9వ టెస్టు మాత్రమే ఆడుతున్న జైస్వాల్.. శతాధిక టెస్టులు ఆడిన సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల కంటే ఎక్కువ సిక్సర్లు బాదాడు. జైస్వాల్ 9 టెస్టులలోనే 29 సిక్సర్లు సాధించగా.. విరాట్ కోహ్లీ 113 టెస్టులలో కొట్టింది 26 సిక్సర్లే. 125 టెస్టులు ఆడిన గవాస్కర్ టెస్టులు, వన్డేలలో కొట్టిన సిక్సర్లు అన్నీ కలిపి 26 మాత్రమే.