వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశ తప్పలేదు. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన సఫారీలు.. సెమీఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేక చతికిలబడగా.. పెద్ద మ్యాచ్‌ల్లో ఎలా రాణించాలో ఉగ్గు పాలతో నేర్చుకున్న ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.
గత మ్యాచ్‌ల్లో దంచికొట్టిన సఫారీ టాపార్డర్.. కంగారూ బౌలర్ల ధాటికి ఉసూరు మనిపించగా.. డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటంతో సూపర్ సెంచరీ చేశాడు. క్లాసెన్ కాస్త సహకరించడంతో ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రొటీస్.. ఆ తర్వాత దాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆసీస్ ఓపెనర్లు ఆరంభంలోనే బౌండ్రీల మోత మోగించగా.. కేశవ్, తబ్రేజ్ షంసీ కట్టుదిట్టమైన బంతులతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. లీగ్ దశలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో దీని కన్నా ఘోరమైన స్థితి నుంచి మ్యాక్స్‌వెల్ ఒక్కడే ఆసీస్‌ను గట్టెక్కించగా.. ఇప్పుడు తలా కొన్ని పరుగులతో కంగారూలు తుదిపోరుకు చేరారు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న మెగా ఫైనల్లో భారత్, ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
కోల్‌కతా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఎనిమిదోసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన భారత్‌తో ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగనున్న టైటిల్ ఫైట్‌లో ఆసీస్ తలపడనుంది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు రాణించినా.. ఒత్తిడిని అధిగమించిన ఆసీస్‌ను విజయం వరించింది. టోర్నీ ఆసాంతం తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్లు చేస్తూ.. ప్రత్యర్థులను హడలెత్తించిన దక్షిణాఫ్రికా ఈ సారి అదే ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆణిముత్యం లాంటి సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. మెగాటోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. కొత్త రికార్డులు నెలకొల్పిన స్టార్లు కీలక మ్యాచ్‌లో విఫలమయ్యారు. కెప్టెన్ టెంబా బవుమా (0) తొలి ఓవర్లోనే ఖాతా తెరవకుండా వెనుదిరగగా.. డికాక్ (3), మార్క్మ్ (10), డసెన్ (6) అతడిని అనుసరించారు. దీంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ పోరాడి జట్టును తిరిగి పోటీలోకి తెచ్చినా.. హెడ్ ఒకే ఓవర్లో క్లాసెన్, జాన్సన్ (0) ఔట్ చేసి సఫారీలను తక్కువ స్కోరుకు పరిమితం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో మూడు, హజిల్‌వుడ్, హెడ్ చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ ఇన్నింగ్స్‌కు కాసేపు వర్షం అంతరాయం కలిగించింది.
అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా.. 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30), జోష్ ఇంగ్లిస్ (49 బంతుల్లో 28), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; ఒక ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. చివర్లో స్టార్క్ (38 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు), కమిన్స్ (29 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) అసమాన పోరాటంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కోట్జీ, షంసీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
అయ్యో ఆఫ్రికా..
విజయం సాధించాలంటే.. కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని ఎందుకు అంటారో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్మురేపే ప్రదర్శనలు చేస్తూ.. ప్రపంచంలో ఏ జట్టునైనా వణికించగల దక్షిణాఫ్రికా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందని చరిత్ర చెబుతున్నది. ఇప్పటికే పలుమార్లు చేతుల్లోకి వచ్చిన అవకాశాలను వదిలేసుకొని ‘చోకర్స్’అని ముద్ర వేసుకున్న సఫారీలు.. మరోసారి రిక్తహస్తాలతో ఇంటిబాటపట్టారు. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన అన్ని విభాగాలు ప్రాణం పెట్టి పోరాడాయి.
కీలక సమయంలో డేవిడ్ మిల్లర్ సెంచరీతో తన విలువ చాటుకుంటే.. క్లాసెన్ అతడికి సహకరించాడు. చివర్లో కోట్జీ (39 బంతుల్లో 19) గొప్ప సంయమనం కనబర్చాడు. ఇక నామమాత్రమైన స్కోరును కాపాడుకునే క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్లు సర్వస్వం ధారపోశారు. కొట్టింది తక్కువ పరుగులే అయినా.. వాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డింగ్ దళంగా గుర్తింపు పొందిన దక్షిణాప్రికా ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో ఆకట్టుకోలేక.. అవకాశాలను వృథా చేసుకుంది. అసాధ్యం అనుకున్న క్యాచ్‌లను సైతం అవలీలగా అందుకోగల సఫారీలు.. చేతుల్లో పడ్డ బంతులను నేలపాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఆసీస్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన హెడ్‌కు రెండుసార్లు జీవనదానం ఇచ్చిన దక్షిణాఫ్రికా.. స్మిత్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కూడా నేల పాలు చేసింది. ఇక ఆఖర్లో కమిన్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సైతం వికెట్ల వెనుక డికాక్ అందుకోలేకపోయాడు. మ్యాచ్ మొత్తం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్రొటీస్.. అదృష్టం కలిసిరాక ఈసారి కూడా నిరాశగానే వెనుదిరిగింది. ఈ టోర్నీలో నాలుగు సెంచరీలతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
-నమస్తే తెలంగాణ క్రీడా
వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదోసారి. 1975, 1987, 1996, 1999, 2003, 2007, 2015లోనూ తుదిపోరుకు చేరిన ఆసీస్ అందులో ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015లో) విశ్వ విజేతగా నిలిచింది.
భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2003 తుదిపోరులో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది.
వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓడటం దక్షిణాఫ్రికాకు ఇది ఐదోసారి. ఇంతకుముందు 1992, 1999, 2007, 2015లోనూ ఓడింది.
దక్షిణాఫ్రికా: 49.4 ఓవర్లలో 212 ఆలౌట్ (మిల్లర్ 101, క్లాసెన్ 47; స్టార్క్ 3/34, కమిన్స్3/51),
ఆస్ట్రేలియా: 47.2 ఓవర్లలో 215/7 (హెడ్ 62, స్మిత్ 30; షంసీ 2/42, కోట్జీ 2/47).