న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ పతకాల పంట పండిస్తున్నది. పోటీకి దిగిన ప్రతీ విభాగంలో సత్తాచాటుతూ తనకు తిరుగులేదని చాటిచెబుతున్నది. ఇప్పటికే రెండు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్న ఇషా..తాజాగా మరో పసిడి దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. మంగళవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ఈవెంటులో ఇషాసింగ్, మను భాకర్, రితమ్ సాంగ్వాన్తో కూడిన భారత త్రయం 16-2 తేడాతో జర్మనీ జట్టుపై అద్భుత విజయం సాధించింది.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కీలక పాయింట్లు కొల్లగొడుతూ పైచేయి సాధించారు. అర్హత రౌండ్లో జర్మనీ(437) కంటే ఒకింత వెనుకంజలో నిలిచినా..ప్రధాన పోరులో భారత షూటింగ్ త్రయం గురి చెక్కచెదరకుండా ఆధిక్యం ప్రదర్శించింది. మరోవైపు 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పంకజ్ ముకేజా, సిప్ట్కౌర్ సమ్రా 12-16తో పోలాండ్ చేతిలో ఓడి రజత పతకం సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ మెగాటోర్నీలో 11 స్వర్ణాలు, 13రజతాలు, 4 కాంస్యాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.