సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు తొలిసారి ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ సర్వ హంగులతో సిద్ధమవుతున్నది. ఫార్ములా-ఈ తొమ్మిదో సీజన్లో భాగంగా వచ్చే నెల 11న హైదరాబాద్‌లో రౌండ్-4 పోటీలు జరుగనున్నాయి. హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్మించిన 2.8కి.మీల ట్రాక్‌పై రేసింగ్ కార్లు రయ్‌మంటూ దూసుకెళ్లనున్నాయి.
అయితే దిరియా(సౌదీఅరేబియా) వేదికగా ఈ నెల 27, 28తేదీల్లో రౌండ్-2,3 పోటీలు జరుగుతున్నాయి. ఇవి ముగిసిన వెంటనే దిరియా నుంచి మొత్తం 26 ఫార్ములా-ఈ కార్లను మూడు ప్రత్యేక కార్గో విమానాల్లో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొస్తున్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్‌కు కార్లు వస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కస్టమ్స్ ఆథరైజేషన్ తర్వాత రేసింగ్ కార్లు ఐమ్యాక్స్ దగ్గర ప్రత్యేకంగా నిర్మిస్తున్న గ్యారేజీలకు చేరుకుంటాయి.