IPL 2024 | కేకేఆర్‌ను ‘ఢీ’ కొట్టెదెవరో? నేడే హైదరాబాద్, రాజస్థాన్ క్వాలిఫయర్-2 పోరు
ఐపీఎల్-17లో ఇదివరకే ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను టైటిల్ పోరులో ఢీకొనబోయే జట్టేదో నేడు తేలనుంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్).. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో అమీతుమీ తేల్చుకోనుంది.
- గెలుపు జోష్‌లో రాయల్స్
- గాడిన పడకుంటే సన్‌రైజర్స్ కథ కంచికే..
- రాత్రి 7:30 గంటల నుంచి
చెన్నై: ఐపీఎల్-17లో ఇదివరకే ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను టైటిల్ పోరులో ఢీకొనబోయే జట్టేదో నేడు తేలనుంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్).. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో అవమానకర ఓటమి ఎదుర్కున్న ఎస్ఆర్హెచ్తో పాటు లీగ్ చివరిదశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడినా బెంగళూరును ‘ఎలిమినేట్’ చేసిన రాజస్థాన్‌కూ టైటిల్ వేటలో ‘క్వాలిఫయర్-2’ అత్యంత కీలకం. బ్యాటింగ్ పవర్ హౌజ్‌గా ఉన్న హైదరాబాద్.. స్పిన్‌కు అనుకూలించే చెపాక్ పిచ్‌పై అత్యుత్తమ స్పిన్నర్లు కలిగిన రాయల్స్‌ను ఎదుర్కోనుండటంతో చెన్నైలో మరో రసవత్తర పోరు ఖాయం!
‘హెడ్’ ఏం చేసేనో?
ఈ సీజన్లో హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (533 పరుగులు), అభిషేక్ శర్మ (413) భీకర ఫామ్‌లో ఉన్నప్పటికీ.. ఆసీస్ ఓపెనర్ గత రెండు మ్యాచ్‌లలో డకౌట్ అవడం హైదరాబాద్‌ను ఆందోళనకు గురిచేసేదే. కోల్‌కతాతో మ్యాచ్‌లో అతడు నిష్క్రమించగానే అభిషేక్ కూడా చేతులెత్తేయడం రైజర్స్‌ను దెబ్బతీసింది. ఈ ఇద్దరూ చెపాక్ పిచ్‌పై రాజస్థాన్ స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్‌ను ఏ మేరకు ఎదుర్కుంటారనేది ఆసక్తికరం. కొత్తబంతితో నిప్పులు చెరిగే బౌల్ట్తోనూ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఓపెనర్లు నిలదొక్కుకుంటేనే హైదరాబాద్‌కు మెరుగైన స్కోరు చేసే అవకాశముంటుంది. గత రెండు మ్యాచ్‌లలో రాణించిన రాహుల్ త్రిపాఠికి తోడు నితీశ్ రెడ్డి, క్లాసెన్ నిలబడితేనే భారీ స్కోరుకు బాటలు వేయొచ్చు. కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ దళం ప్రదర్శన హైదరాబాద్‌ను భయపెడుతున్నా తక్కువ స్కోర్లు నమోదయ్యే చెన్నై పిచ్‌పై బౌలర్లు సత్తాచాటాలని ఎస్ఆర్హెచ్ ఆశిస్తోంది.
సమిష్టితత్వాన్నే నమ్ముకున్న రాయల్స్
ఐపీఎల్-17 ఆరంభంలో నిలకడగా విజయాలు సాధించి తర్వాత తడబడ్డా ఎలిమినేటర్‌లో సమిష్టిగా రాణించిన రాయల్స్.. మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శననే నమ్ముకుంది. నాకౌట్ దశలో జైస్వాల్ ఫామ్‌ను అందుకోవడం ఆ జట్టు బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచేదే. శాంసన్ టచ్‌లోనే ఉండగా మిడిలార్డర్లో రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్ వంటి హిట్టర్లతో ఆ జట్టు దుర్బేధ్యంగా ఉంది. అంతగా పటిష్టంగా లేని హైదరాబాద్ బౌలింగ్ దళం వీరి దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే ఎస్ఆర్హెచ్కు తిప్పలు తప్పవు. చెన్నై పిచ్ గురించి అణువణువూ తెలిసిన అశ్విన్‌తో పాటు లెగ్ స్పిన్నర్ చాహల్ రాజస్థాన్ బౌలింగ్‌కు కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం
మెరీనా తీరాన ఉన్న చెపాక్‌లో రెండో ఇన్నింగ్స్ కీలకం. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌కే మొగ్గుచూపొచ్చు. ఇక్కడ ఛేదన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువ కాగా ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. చెన్నైలో గత రెండ్రోజులుగా తేలికపాటి వర్షాలు పడుతుండటంతో వరుణుడు ఈ మ్యాచ్‌ను సాగనిస్తాడా..? అన్నది ఆందోళనపరిచేదే. మ్యాచ్ సమయానికి చెపాక్‌లో వర్షం పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ నివేదికలు హెచ్చరిస్తుండటం గమనార్హం.
తుది జట్లు (అంచనా):
హైదరాబాద్: హెడ్, అభిషేక్, రాహుల్, నితీశ్, క్లాసెన్, సమద్, షాబాజ్, కమిన్స్, భువనేశ్వర్, వియస్కాంత్, నటరాజన్
రాజస్థాన్: జైస్వాల్, కోహ్లర్, శాంసన్, పరాగ్, జురెల్, హెట్మెయర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్, చాహల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

