అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ 16వ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏకపక్ష విజయంతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానాన్ని అధిష్టించింది.
యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్లో తొలి శతకం నమోదు చేసుకోవడంతో మొదట టైటాన్స్ భారీ స్కోరు చేయగా.. ఆనక ఛేదనలో హైదరాబాద్ నిరాశ పరిచింది. బ్యాటర్లు కనీసం ప్రతిఘటించకుండా.. పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించింది.
అహ్మదాబాద్: ఏడాది క్రితమే మెగాలీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్ చేరింది. నిరుడు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన హార్దిక్ సేన.. తాజా సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. సోమవారం ఏకపక్షంగా సాగిన పోరులో టైటాన్స్ 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసింది. ఈ విజయంతో 13 మ్యాచ్‌ల్లో తొమ్మిందింట నెగ్గిన పాండ్యా సేన 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లతో హైదరాబాద్ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. యంగ్ గన్ శుభ్‌మన్ గిల్ (58 బంతుల్లో 101; 13 ఫోర్లు, ఒక సిక్సర్) శతకంతో చెలరేగగా.. సాయి సుదర్శన్ (47; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. వీరిద్దరు మినహా గుజరాత్ బ్యాటర్లలో మరే ఆటగాడు రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయాడు.
వృద్ధిమాన్ సాహా (0), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3), షనక (9 నాటౌట్), రషీద్ ఖాన్ (0) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. చివర్లో భువనేశ్వర్ కుమార్ (27) కాస్త పోరాడాడు. అన్మోల్ప్రీత్ (5), అభిషేక్ శర్మ (5), రాహుల్ త్రిపాఠి (1), కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (10), సన్వీర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4), మార్కో జెన్సెన్ (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 188/9 (గిల్ 101, సుదర్శన్ 47; భువనేశ్వర్ 5/30),
హైదరాబాద్: 154/9 (క్లాసెన్ 64, భువనేశ్వర్ 27; షమీ 4/21, మోహిత్ 4/28).