ఈస్ట్ రూథర్‌ఫర్డ్: గత ఎడిషన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకుని ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో నాకౌట్ దశను ఘనంగా ఆరంభించింది. బుధవారం ఉదయం జరిగిన పోరులో ఫ్రాన్స్.. 3-0తో స్వీడన్‌ను చిత్తుచేసింది. ‘గోల్డెన్ బూట్’ రేసులో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ (6 గోల్స్)తో పోటీపడుతున్న ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె (6) మరో డబుల్ ధమాకాతో ఆ జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు.
45వ, 74వ నిమిషాల్లో ఎంబాపె గోల్స్ కొట్టగా బ్రాడ్లీ బార్కొల (53వ) ఓ గోల్ సాధించాడు. తొలి అర్ధభాగం ముగుస్తుందనగా ఒస్మాన్ డెంబెలె ఇచ్చిన పాస్‌ను అందుకున్న ఎంబాపె.. స్వీడన్ స్ట్రైకర్ విక్టర్ గ్యూకెర్స్ను దాటుకుని గోల్ చేశాడు. సెకండాఫ్ మొదలయ్యాక బార్కొల గోల్‌తో 2-0 ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్‌ను ఏ స్థితిలోనూ స్వీడన్ నిలువరించలేకపోయింది. 74వ నిమిషంలో ఎంబాపె మరో గోల్‌తో ఆ జట్టు విజయం ఖాయమైంది. మ్యాచ్‌లో 53 శాతం తమ నియంత్రణలోనే ఉంచుకున్న ఫ్రాన్స్.. ఏకంగా 25 సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దండెత్తగా స్వీడన్ మాత్రం ప్రత్యర్థి దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.
తాజా గోల్స్‌తో ఎంబాపె.. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో మెస్సీ (19) తర్వాత రెండో స్థానం (18)లో ఉన్నాడు. మెస్సీ 29 మ్యాచుల్లో ఈ ఘనత సాధిస్తే ఫ్రాన్స్ సంచలనం 18 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. వరల్డ్‌కప్ నాకౌట్ దశలో ఎంబాపెకు ఇది రికార్డుస్థాయిలో
పదో గోల్ కావడం మరో విశేషం. దీంతో అతడు బ్రెజిల్ దిగ్గజాలు లియనైడస్ ద సిల్వ, రొనాల్డో (8) రికార్డును అధిగమించాడు.
అట్లాంటాలో ఉత్కంఠగా జరిగిన పోరులో ఇంగ్లండ్ 2-1తో కాంగోను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరింది. కెప్టెన్ హ్యారీకేన్ (75వ, 86వ) పది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినా కాంగో అసాధారణంగా పోరాడింది. ఏడో నిమిషంలోనే ఆ జట్టు నుంచి బ్రయాన్ సిపెంగా తొలి గోల్ చేసి ఇంగ్లిష్ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. ఫస్టాఫ్‌తో పాటు రెండో అర్థభాగం సగం వరకూ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎంత యత్నించినా కాంగో రక్షణశ్రేణిని ఛేదించలేకపోయారు. కానీ హ్యారీకేన్ మ్యాజిక్‌తో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది.