డబ్లిన్ : క్రికెట్లో మరో రికార్డు బద్దలైంది. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న ఇంటర్-ప్రావిన్షియల్ టీ20 ట్రోఫీలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్, మన్సస్టర్ రెడ్స్ క్రికెటర్ కర్టిస్ కాంఫర్ అరుదైన రికార్డుతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం నార్త్-వెస్ట్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాంఫర్ ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి ప్రొఫెషనల్ నయా ఫీట్‌ను నమోదు చేశాడు. 189 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిటన నార్త్-వెస్ట్ వారియర్స్ కాంఫర్ ధాటికి 88 పరుగులకే కుప్పకూలింది.
ఒక దశలో 5 వికెట్లకు 87 పరుగులతో ఉన్న వారియర్స్ టీమ్‌ను కంపర్ కోలుకోలేని దెబ్బతీశాడు. 12.4 బంతికి జారెడ్ విల్సన్.. కాంఫర్‌కు తొలి వికెట్ దక్కగా, తర్వాత బంతికి గ్రహమ్ హ్యూమ్ ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు. అదే జోరు కొనసాగిస్తూ 14వ ఓవర్ తొలి మూడు బంతుల్లో అండీ మెక్‌బ్రైన్, రాబీ మిల్లర్, జోష్ విల్సన్ వరుసగా పెవిలియన్ చేరడంతో కాంఫర్ ఖాతాలో హ్యాట్రిక్ చేరింది.