సియాటెల్ (యూఎస్ఏ): అనూహ్య ఫలితాలు వెలువడుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరు సాకర్ అభిమానులను ఫిదా చేసింది. ఆట మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనేవరకూ గెలుపు రేసులోనే లేని బెల్జియం ఆఖర్ల్లో అద్భుతం చేసింది. 85వ నిమిషం వరకు 0-2తో నిలిచి ఓటమి ఖాయం అనుకున్న దశ నుంచి అసాధారణంగా పుంజుకున్న ఆ జట్టు వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యుత్తమ కమ్బ్యాక్లలో ఒకటి అనదగ్గ విజయాన్ని నమోదుచేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి రసవత్తరంగా సాగిన పోరులో బెల్జియం 3-2తో సెనెగల్‌ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. హబీబ్ దియారా (24వ నిమిషంలో), ఇస్మాయిల్ సార్ (51వ) సెనెగల్ తరఫున గోల్స్ చేయగా రొమెలు లుకాకు (86 వ) ఓ గోల్ కొట్టగా.. యురి టిలెమన్స్ (89వ, 120+5వ) డబుల్ గోల్స్‌తో ‘రెడ్ డెవిల్స్’ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం, ఈ నెల 6న యూఎస్ఏతో అమీతుమీ తేల్చుకోనుంది.
మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ర్యాంకింగ్‌లో ఉన్న బెల్జియంను నిలువరించిన సెనెగల్ ప్రత్యర్థిపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట జరిగిన నిర్ణీత సమయంలో సుమారు 85 నిమిషాల పాటు ప్రత్యర్థికి చుక్కలు చూపించి ఆ జట్టును దాదాపు ఓడించినంత పనిచేసింది. ఆట ఆరంభం నుంచే బెల్జియం డిఫెన్స్‌కు సవాల్ విసురుతూ ఆడిన ఈ ఆఫ్రికా దేశానికి 24వ నిమిషంలోనే తొలి గోల్ లభించింది. సడియొ మనె క్రాస్‌ను అందుకున్న సార్.. హెడర్‌తో బంతిని నెట్లోకి నెట్టేందుకు యత్నించినా బంతి స్టాండ్‌కు తగలి పక్కకు వెళ్లగా అక్కడే ఉన్న దియారా మెరుపు వేగంతో గోల్ చేసి సెనెగల్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు. ఫస్టాఫ్ ముగిసిన వెంటనే మౌసా నుంచి వచ్చిన లాంగ్ పాస్‌ను అందుకున్న ఇస్మాయిల్.. బెల్జియం డిఫెన్స్‌ను దాటుకుంటూ గోల్ కొట్టి తన జట్టును 2-0 ఆధిక్యానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బెల్జియం పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగినా ఆ జట్టు పప్పులుడకలేదు.
ఆట మరో 5 నిమిషాల్లో ముగుస్తుందనేవరకూ బెల్జియం.. 0-2తోనే ఉంది. కానీ ఆఖరివరకూ నమ్మకాన్ని కోల్పోని ఆ జట్టు.. 86వ నిమిషంలో లుకాకు గోల్‌తో పోటీలోకి వచ్చింది. 55వ నిమిషంలో ఫీల్డ్‌లోకి వచ్చిన లుకాకు.. థామస్ ఇచ్చిన పాస్‌ను అందుకుని బాక్స్‌కు అతి సమీపం నుంచి గోల్ చేసి బెల్జియం అభిమానుల్లో జోష్ నింపాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే ట్రాసర్డ్ ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న టిలెమన్స్.. తలతో బంతిని నెట్లోకి పంపించడంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఇక 30 నిమిషాల అదనపు సమయంతో పాటు ఇంజూరీ టైమ్ ముగిసేవరకూ గోల్ లేకపోవడంతో మరో షూటౌట్ తప్పదా? అనిపించింది. ఈ టైమ్‌లో టిలెమన్స్ను బాక్స్ లో సెనెగల్ ఆటగాళ్లు కిందపడేశారు. ‘వార్’ రివ్యూ.. ప్రత్యర్థి నిరసనల తర్వాత రిఫరీ బెల్జియంకు పెనాల్టీ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రశాంతంగా గోల్ కొట్టిన టిలెమన్స్ ఈ టోర్నీకే హైలైట్లా నిలిచే విజయంతో తన జట్టును ప్రిక్వార్టర్స్‌కు చేర్చాడు.

సొంత అభిమానుల నడుమ అగ్రరాజ్యం అమెరికా మరోసారి రెచ్చిపోయింది. గురువారం శాన్ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన పోరులో యూఎస్ఏ 2-0తో బోస్నియా హెర్జ్గొవినియాను ఓడించి టోర్నీలో రౌండ్-16కు దూసుకెళ్లింది. ఫోలారిన్ బాల్గున్ (45వ), మాలిక్ టిల్మన్ (82 వ) చెరో గోల్స్ చేశారు. ఈ మ్యాచ్ గోల్‌తో ప్రపంచకప్‌లో మూడో గోల్ కొట్టిన ఫోలారిన్కు 64వ నిమిషంలో రిఫరీ రెడ్‌కార్డు చూపడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో టిలెమన్స్ రెండో గోల్ కొట్టిన సమయం. ఓ వరల్డ్ కప్ మ్యాచ్‌లో చిట్ట చివరన విన్నింగ్ గోల్ నమోదు చేసిన ప్లేయర్‌గా అతడు రికార్డు సృష్టించాడు.
2 ఒక వరల్డ్ కప్ మ్యాచ్‌లో రెండు అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన బెల్జియం రెండో ప్లేయర్ టిలెమన్స్. 1934లో బెర్నార్డ్ వూర్హూఫ్ తొలిసారి
ఆ ఘనత సాధించాడు.
2 ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం జట్టు రెండు గోల్స్ వెనుకబడ్డ తర్వాత కూడా పుంజుకొని గెలవడం రెండోసారి. 2018లో జపాన్‌పై 3-2 తేడాతో గెలిచింది.
స్విట్జర్లాండ్ x అల్జీరియా
ఉ. 8.30 నుంచి
ఆస్ట్రేలియా x ఈజిప్ట్
రా. 11.30 నుంచి
అర్జెంటీనా x కాబో వెర్డె
తె.జా. 3.30 నుంచి