ప్రతీ ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ప్రపంచానికి ఒక కొత్త స్టార్‌ను పరిచయం చేస్తుంది. గతంలో పీలే, ఆ తర్వాత ఎంబాపె టీనేజ్లోనే వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టించి ప్రపంచాన్ని ఆకర్షించాడు. తాజా టోర్నీ లామిన్ యమాల్ రూపంలో నయా హీరోను అందించింది. స్పెయిన్ విశ్వవిజేతగా నిలవడంలో 19 ఏండ్ల ఈ వండర్ కిడ్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోవడంతో ఆ జట్టు దిగ్గజం లియోనల్ మెస్సీ కెరీర్ ముగుస్తుందని అభిమానులు బాధపడుతున్న వేళ యమాల్రూపంలో సాకర్ సామ్రాజ్యానికి సరికొత్త యువరాజు దొరికాడు.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచకప్ గెలుస్తావా అన్న ప్రశ్నకు టోర్నీ ఆరంభంలో యమాల్ ఒక చిన్న నవ్వుతో ‘అవును’ అని సమాధానం ఇచ్చాడు. అన్న మాట ప్రకారమే తను మైదానంలో అద్భుతాలు చేశాడు. ఫైనల్లో బరిలోకి దిగడం ద్వారా పీలే (1958), ఎంబాపె (2018), గియుసేప్ బెర్గోమి (1982) సరసన అత్యంత పిన్న వయసులో ప్రపంచకప్ ఫైనల్ ఆడి, ట్రోఫీ గెలిచిన నాలుగో టీనేజర్‌గా లామిన్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్ జాతీయ జట్టు తరఫున యమాల్ గణాంకాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇప్పటివరకు స్పెయిన్ తరఫున ఆడిన 27 అధికారిక మ్యాచ్‌ల్లో యమాల్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. మేజర్ టోర్నమెంట్లలో అతడు తుది జట్టులో బరిలోకి దిగిన 12 మ్యాచ్‌ల్లోనూ స్పెయిన్ విజయం సాధించింది. యూరోపియన్ ఫుట్‌బాల్ చరిత్రలో ఏ ఆటగాడికీ లేని అరుదైన 100 శాతం విన్నింగ్ రేట్ రికార్డు ఇది. ఈ వరల్డ్‌కప్‌లో యమాల్ ఒకే ఒక్క గోల్ కొట్టినా.. మైదానంలో చిరుతలా కదులుతూ స్పెయిన్ జట్టు కేంద్ర బిందువుగా మారాడు.
డ్రిబ్లింగ్ కింగ్..
గాయంతో టోర్నమెంట్లో అడుగుపెట్టిన యమాల్ మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ వెళ్లాడు. టోర్నీలో కొట్టింది ఒక్క గోలే అయినా.. జట్టుపై అతడి ప్రభావం గోల్స్‌కు అతీతం. టోర్నీ అంతటా ప్రత్యర్థులపై ఏకంగా 49 డ్రిబుల్స్ ప్రయత్నించి, అందులో 22 విజయవంతం చేశాడు. ఈ టోర్నీలో మెస్సీ (25) తర్వాత అత్యధిక డ్రిబుల్స్ పూర్తి చేసింది యమాల్ మాత్రమే. ‘నేను గోల్స్ చేయడమే కాకుండా, నా కదలికల ద్వారా ప్రత్యర్థి డిఫెండర్లను నా వైపు తిప్పుకొని సహచర ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడానికే ప్రాధాన్యత ఇస్తాను‘ అని ఈ యువ ఆటగాడు తన పరిణతిని చాటుకున్నాడు.
మెస్సీ వారసత్వం.. చారిత్రక బంధం
ఫుట్‌బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీతో యమాల్‌ను పోల్చడం ఎప్పటి నుంచో జరుగుతోంది. దాదాపు 20 ఏండ్ల క్రితం, ఐదు నెలల వయసున్న యమాల్‌కు నాడు 20 ఏండ్ల మెస్సీ స్నానం చేయించిన ఒక ఫోటో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక అద్భుత దృశ్యంగా మారింది. బార్సిలోనా క్లబ్లో మెస్సీ 15 ఏండ్ల పాటు ధరించిన ప్రతిష్టాత్మక 10 నంబర్ జెర్సీని ఇప్పుడు యమాల్ ధరిస్తున్నాడు. మెస్సీకి 19 ఏండ్లు వచ్చేసరికి బార్సిలోనా తరఫున 41 మ్యాచ్‌లు మాత్ర మే ఆడగా, యమాల్ అప్పటికే 151 మ్యాచ్‌లు పూర్తి చేయడం విశేషం.
స్పానిష్ క్లబ్ బార్సిలోనా సూపర్ స్టార్‌గా ఎదిగినా, యమాల్ తన మూలాలను మర్చిపోలేదు. స్పెయిన్‌లోని రొకాఫొండా అనే కార్మిక వర్గ ప్రాంతంలోని కాంక్రీట్ పిచ్‌లపై ఆడిన రోజులను అతడు ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు. మైదానంలో తను ఆడే వినూత్న ఆటతీరు చూసి స్టాండ్స్‌లో ఉన్న జనం లేచి చప్పట్లు కొట్టే ఆ అనుభూతి కోసమే తను ఎప్పుడూ ఆడతానని యమాల్ చెబుతాడు. ఈ ప్రపంచకప్ ఫైనల్ మెస్సీ కెరీర్‌కు ముగింపు కావచ్చు, కానీ 19 ఏండ్ల వయసులోనే ప్రపంచకప్ అందుకొని మెస్సీ ఘన వారసత్వాన్ని కొనసాగించే సత్తా తనకు ఉందని యమాల్ నిరూపించాడు.

యంగెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ
కుబార్సీ (19 ఏండ్లు – స్పెయిన్)
గోల్డెన్ బాల్
(ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్) – రోడ్రి
గోల్డెన్ గ్లవ్
ఉనై సిమోన్ (స్పెయిన్) 8 మ్యాచ్‌ల్లో ఏడు క్లీన్ షీట్స్. టోర్నీలో ప్రత్యర్థి జట్లకు ఒకే ఒక గోల్ ఇచ్చాడు.
గోల్డెన్ బూట్
కిలియన్ ఎంబాపె (10 గోల్స్ – ఫ్రాన్స్)
ఫెయిర్ ప్లే అవార్డు
నెదర్లాండ్స్
38 అర్జెంటీనాపై విజయంతో స్పెయిన్ వరుసగా 38 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది.ఈ క్రమంలో ఇటలీ (37) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 2024 మార్చి నుంచి స్పెయిన్ 38మ్యాచ్‌లు ఆడగా 29 గెలిచి, 9 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.

ఆధునిక సాకర్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు పొందిన లియోనల్ మెస్సీ, ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలికాడా? స్పెయిన్‌తో ఫైనల్ అయ్యాక అర్జెంటీనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అతడిని ఆరాధించే అభిమానుల మదిలో ఇదే ప్రశ్న. ఫైనల్ ముగిశాక మెస్సీ కన్నీటిపర్యంతం అవుతూ కనిపించడం, ఈ మ్యాచ్ ఆరంభానికి కొద్ది సమయం ముందు ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నేండ్ల కెరీర్లో టైటిల్స్ కంటే ఈ మొత్తం ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ జట్టుతో కలిసి కఠిన సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకుసాగడం, ఆలోచనలు పంచుకోవడం.. ఇలా ప్రతీక్షణం ఆస్వాదించదగినదే. ఈ సందర్భంగా నా సహచరులు, కోచింగ్ బృందానికి పేరుపేరునా కృతజ్ఞతలు. రేపటి మ్యాచ్‌లో ఏమైనా జరుగనివ్వండి.
ఈ జట్టు ఇప్పటికే ఎవరూ చెరిపేయలేని కథను లిఖించింది. లెట్స్ గో అర్జెంటీనా’ అని రాయడం అతడి రిటైర్మెంట్ అనుమానాలకు బలం పెంచింది. అంతేగాక ఇదే తన చివరి మ్యాచ్ అని అర్థం వచ్చేలా ‘ది లాస్ట్ టాంగో’ అని పేర్కొనడం గమనార్హం. వరుసగా రెండోసారి ప్రపంచకప్ టోర్నీని అందుకోవాలన్న కల చెదిరిపోవడంతో ఈ అర్జెంటీనా సారథి తన చివరి మ్యాచ్ ఆడేశాడని వాదనలు వినిపిస్తున్నా రిటైర్మెంట్పై మెస్సీ అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు. 39 ఏండ్ల వయసులో రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ ఆడిన మెస్సీకి ఇదే ఆఖరి టోర్నీ అని, అంతే తప్ప చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే కాదన్న వాదనలూ ఉన్నాయి. 2028లో కోపా అమెరికా టోర్నీ తర్వాత అతడు ఆట నుంచి నిష్క్రమిస్తాడన్న చర్చలూ నడుస్తున్నాయి.
2 మూడు వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆడిన రెండో ప్లేయర్ మెస్సీ (2014, 2022, 2026). గతంలో బ్రెజిల్ ఆటగాడు కఫు (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాడు.