వీరవిహారం, విజృంభణ అనే పదాలు చిన్నబోయేలా! విధ్వంసం, వీరంగం అనే ఉపమానాలే తక్కువయ్యేలా! ఇంగ్లండ్ జట్టు వన్డే క్రికెట్లో నయా చరిత్ర లిఖించింది!! ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ వీరోచిత శతకాలకు..లివింగ్‌స్టోన్ ఊర మాస్ ఇన్నింగ్స్ తోడవడంతో.. ఇంగ్లిష్ జట్టు వన్డే క్రికెట్లో అత్యధిక స్కోరును తమ పేరిట రాసుకుంది.
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్లో వీరంగమాడుతున్న ఇంగ్లండ్ జట్టు.. అత్యధిక స్కోరు రికార్డును సవరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే కాగా.. ఈ జాబితాలో తొలి మూడు (498/4, 481/6, 444/3) స్థానాల్లోనూ ఇంగ్లిష్ జట్టే ఉండటం విశేషం. కొత్త ఓపెనర్ ఫిల్ సాల్ట్ (93 బంతుల్లో 122; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా.. డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టాడు.
ఇటీవల ఐపీఎల్ 15వ సీజన్లో వరుస సెంచరీలతో అదరగొట్టిన వికెట్ కీపర్ జోస్ బట్లర్ (70 బంతుల్లో 162 నాటౌట్; 7 ఫోర్లు, 14 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఖర్లో లివింగ్‌స్టోన్ (22 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లడంతో.. ఇంగ్లండ్ కొండంత స్కోరు చేయగలిగింది. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్లు దంచుడు మీద పడటంతో చూస్తున్నది లైవ్ మ్యాచా లేక హైలైట్సా అని అభిమానులు అనుమాన పడేలా ఇంగ్లిష్ ఆటగాళ్లు ఊచకోత కొనసాగించారు. ఒక దశలో ఐదొందల మార్క్ దాటుతుందనిపించిన మోర్గాన్ సేన పంచశతకానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 499 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ (72) టాప్ స్కోరర్ కాగా.. మోయిన్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు.
1వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే (498/4) అత్యధిక స్కోరు. 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ చేసిన 481/6 స్కోరు రెండో స్థానానికి చేరింది.
3వన్డే మ్యాచ్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయడం ఇది మూడోసారి. గతంలో దక్షిణాఫ్రికా రెండు సార్లు ఈ ఘనత సాధించింది.
3వన్డే క్రికెట్ అత్యధిక స్కోర్లలో తొలి మూడు స్థానాల్లో ఇంగ్లండ్ జట్టే కొనసాగుతున్నది. తాజా పోరులో 498/4 స్కోరు చేసిన ఇంగ్లిష్ జట్టు.. ఆస్ట్రేలియాపై (481/6), పాకిస్థాన్‌పై (444/3) భారీ స్కోర్లు చేసింది.
2ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన శతకం (47 బంతుల్లో) చేసిన ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. అతి తక్కువ బంతుల్లో (46) రికార్డు కూడా అతడి పేరిటే ఉంది.
1వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (26) నమోదైన మ్యాచ్‌గా ఈ పోరు చరిత్రకెక్కింది. గతంలోనూ ఈ రికార్డు ఇంగ్లండ్ (25) పేరిటే ఉంది.