ENG vs SL: డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగి అత్యంత చెత్త ప్రదర్శనతో వరుస ఓటములతో కుంగిపోతున్న ఇంగ్లండ్ మరోసారి విఫలమైంది. శ్రీలంకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు..33.2 ఓవర్లలో 156 కే ఆలౌట్ అయింది. లంక బౌలర్లు సమిష్టిగా రాణించి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి విజయానికి బాటలు పరుచుకున్నారు. ఇంగ్లండ్‌లో బెన్ స్టోక్స్.. ముక్కీమూలుగుతూ 73 బంతులాడి ఆరు బౌండరీల సాయంతో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్..ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు డేవిడ్ మలన్ (28), జానీ బెయిర్ స్టో (30)లు తొలి వికెట్ కు 6.3 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. కానీ అప్పుడే ఇంగ్లండ్ పతనం మొదలైంది. పతిరాన స్థానంలో జట్టులోకి వచ్చిన సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్.. మలన్‌ను ఔట్ చేశాడు. కొద్దిసేపటికే జో రూట్ (3) రనౌట్ అయ్యాడు. కసున్ రజిత వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి బెయిర్ స్టో.. ధనంజయకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ భారీ ఆశలుపెట్టుకున్న కెప్టెన్ జోస్ బట్లర్ (8) తో పాటు లియామ్ లివింగ్‌స్టోన్ (1)లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరినీ లాహిరు కుమార వరుస ఓవర్లలో ఔట్ చేసి ఇంగ్లీష్ జట్టును కోలుకోనీయలేదు.
బెన్ స్టోక్స్ ఆదుకున్నా..
85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బెన్ స్టోక్స్.. మోయిన్ అలీ (15)తో కలిసి ఇంగ్లండ్ స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 37 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మాథ్యూస్.. మరోసారి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. మోయిన్ అలీని ఔట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. క్రిస్ వోక్స్ డకౌట్ అవగా .. మరీ నెమ్మదిగా ఆడిన స్టోక్స్‌ను లాహిరు కుమార వేసిన 30వ ఓవర్లో తొలి బంతికి దసున్ హేమంతకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5)లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. లంక బౌలర్లలో లాహిరు కుమార మూడు వికెట్లు తీయగా మాథ్యూస్, కసున్ రజిత లు తలా రెండు వికెట్లు తీశారు.