సముద్రపు ఒడ్డులో నిల్చున్న వ్యక్తిపై.. సునామీ విరుచుకుపడితే పరిణామమేంటో ఊహించగలరా!
నిల్చున్న చోటే కాళ్ల కింద భూమి కంపించడాన్ని ఎప్పుడైనా అనుభవించారా! వెయ్యి మెగావోల్ట్ల విద్యుత్
ప్రవాహానికి మనిషి రూపమిస్తే ఎలా ఉంటుందో తెలుసా!! ఈ మూడు కలిసి మైదానంలో వీర విహారం చేస్తే అతడే పీలే..
ఉరుములు లేని మెరుపులా.. హెచ్చరికలు లేని తుఫానులా.. ఫుట్‌బాల్ జగత్తును తన అసమాన ప్రతిభతో ఓలలాడించిన సాకర్ దిగ్గజం పీలే కన్నుమూశాడు.
పక్షి కన్నుకు గురిపెట్టిన పార్థుడిలా.. ప్రత్యర్థిలోని సగం బలాన్ని లాగేసుకునే వాలిలా.. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిలా.. రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని ఉర్రూతలూగించిన కింగ్ పీలే భువి నుంచి దివికేగాడు.
గ్రౌండ్లో అడుగుపెడితే.. గోల్ పోస్ట్ తప్ప మరొకటి పట్టని ఆ మౌన ముని..మైదానం బయట కూడా తన హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పదేండ్ల వయసులోనే ప్రపంచకప్ సాధిస్తానని తండ్రికి మాటిచ్చి.. ఏడేండ్లు తిరిగే సరికి దాన్ని నిజం చేసిన మేరునగధీరుడు క్రీడాలోకాన్ని శోకసంద్రంలో విడిచి అంతిమ శ్వాస తీసుకున్నాడు.
ఫుట్‌బాల్ కొనేందుకు కూడా డబ్బులు లేని పేదరికంలో పుట్టిన ఆ బుడతడు.. ప్లాస్టిక్ సంచిలో చిత్తు కాగితాలు వేసి దాన్నే బంతిలా ప్రాక్టీస్ చేస్తూ ఎదిగిన వైనం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ఒక్కసారి ఫిఫా ప్రపంచకప్ సాధించడమే గొప్ప అనుకుంటున్న సమయంలో ఏకంగా మూడుసార్లు ఆ ముచ్చట
తీర్చుకున్న గత శతాబ్దపు అత్యుత్తమ ప్లేయర్ ఇక సెలవని నిష్క్రమించాడు.
సావోపాలో: సాకర్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడిగా గుర్తింపు పొందిన పీలే ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బ్రెజిల్ దిగ్గజం.. గురువారం రాత్రి మృతిచెందారు. అవయవాలు పనిచేయకపోవడంతో పాటు పెద్దపేగు క్యాన్సర్ తీవ్రమవడంతో 82 ఏండ్ల పీలే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలతో బాధపడుతున్న పీలే.. సావోపాలోలోని ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 21 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో మూడు ప్రపంచకప్‌లు ముద్దాడిన పీలే.. 1363 మ్యాచ్‌లాడి 1281 గోల్స్ చేశారు. ప్రపంచంలో మరే ఆటగాడు ఇన్ని గోల్స్ సాధించలేదు.
బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన పీలే.. అందులో 77 గోల్స్ నమోదు చేశారు. ఫిఫా ప్రపంచకప్‌ను మూడుసార్లు గెలిచిన జట్టులో ఉన్న ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కిన పీలే.. తానాడిన తొలి ప్రపంచకప్ (1958)లోనే ఆరు గోల్స్ కొట్టి అదరగొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న పీలేను.. 2000 సంవత్సరంలో ఫిఫా ‘శతాబ్దపు అత్యుత్తుమ ఆటగాడి’గా ప్రకటించింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంటెస్ డో నాసిమెంటో కాగా.. పదిహేడేండ్ల వయసులోనే పీలే బ్రెజిల్ తరఫున తొలి మ్యాచ్ ఆడారు.
పీలే మృతితో క్రీడాలోకం శోకసంద్రంలో మునిగిపోగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా.. పలు దేశాల అధినేతలు, రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. ‘పీలే గొప్ప క్రీడాకారుడి కంటే ఎక్కువ. ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా అతడున్నాడంటే కొండంత అండ ఉండేది. మన ఫుట్‌బాల్ కింగ్ విజయవంతమైన బ్రెజిల్‌కు ప్రతినిధి. ఆయన కష్టాలకు భయపడలేదు. తన తండ్రికి ప్రపంచ కప్ ఇస్తానని వాగ్ధానం చేశారు. మాకు మూడు బహుమతులు అందించారు. కింగ్ మాకు కొత్త బ్రెజిల్‌ను పరిచయం చేశారు. ఆయన వారసత్వానికి మేం చాలా కృతజ్ఞులం. ధన్యవాదాలు పీలే.’అని బ్రెజిల్ ఫుట్‌బాల్ కన్ఫెడరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
నేటి తరానికి ఫుట్ బాల్ అంటే.. లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లే గుర్తుకు వస్తాయి. కాస్త వెనక్కి వెళ్తే డిగో మారడోనా సాకర్ మాంత్రికుడు అనే విషయం తెలుస్తుంది. కానీ.. అసలు ఫుట్‌బాల్‌ను విశ్వవ్యాప్తం చేస్తూ.. యావత్ ప్రపంచాన్ని తన అద్వితీయ ప్రదర్శనతో పూనకాలు తెప్పించిన ఘనత మాత్రం బ్రెజిల్ దిగ్గజం పీలేదే. ప్రస్తుత క్రీడాలోకంలో పదో నంబర్ జెర్సీకి ఇంత ఆదరణ దక్కడానికి అసలు సిసలు కారణం అతడే. పేదరికంలో పుట్టి పెరిగిన పీలేకు ఫుట్ బాల్ కొనుకునే ఆర్థిక స్థోమత కూడా లేకపోవడంతో ఉత్త కాళ్లతో కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ డబ్బాలతో ఆడేవాడు.
మొదటి సారి ఫుట్‌బాల్ కొనుక్కోవడానికి పల్లీలు అమ్మడంతో పాటు థియేటర్ల దగ్గర షూ పాలిష్ చేసిన పీలే.. వ్యవసాయ భూముల్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఫుట్‌బాల్ వీరాభిమాని అయిన తండ్రికి ప్రపంచకప్ అందిస్తానని చిన్నప్పుడే మాటిచ్చిన పీలే.. ఆ తర్వాత దాన్ని ఒకటికి మూడుసార్లు నిజం చేసి చూపాడు. తండ్రి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన పీలే.. ఫార్వర్డ్‌గా, అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా మైదానంలో అనితర సాధ్యమైన విన్యాసాలతో అభిమానులను అలరించాడు. 1958వ సంవత్సరంలో 17 ఏండ్ల వయసులో తొలిసారి బ్రెజిల్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న పీలే.. మోకాలి గాయం ఇబ్బందిపెడుతున్నా.. ఆ నొప్పిని పంటి బిగువున భరిస్తూ విజృంభించాడు.
వేల్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓ గోల్‌తో యావత్ ప్రపంచానికి తన ఆగమనాన్ని ఘనంగా చాటిన పీలే.. ఫ్రాన్స్‌తో సెమీఫైనల్లో హ్య్రాటిక్ గోల్స్‌తో విజృంభించాడు. దీంతో అతడి పేరు మారుమోగి పోగా.. ఫైనల్లో స్వీడన్‌పై మరో రెండు గోల్స్‌తో క్రీడా జగత్తుకు కొత్త హీరో అయ్యాడు. అనామకుడిగా టోర్నీలో అడుగుపెట్టి ఆరు గోల్స్‌తో అల్లాడించిన పీలే.. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ప్రపంచకప్‌ను ముద్దాడాడు. ఆ తర్వాత ఏ దశలోనూ వెనుదిరిగి చూసుకోని ఈ ఆరడుగుల ఆజానుభావుడు మరో రెండు ప్రపంచకప్‌లతో పాటు సాకర్లోని అన్ని మేజర్ టైటిల్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తనకిష్టమైన ఆటగాడు, అర్జెంటీనా దిగ్గజం మారడోనా మృతి చెందిన సమయంలో.. అతడితో కలిసి స్వర్గంలో ఫుట్‌బాల్ ఆడతానని ప్రకటించిన పీలే.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు దిగంతాలకేగాడు.
సాకర్ మాంత్రికుడు పీలే అసమాన ప్రదర్శనకు నిలువెత్తు నిదర్శనం ఈ బైస్కిల్ కిక్ షాట్. 1968 సెప్టెంబర్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో పీలే కొట్టిన షాట్ సాకర్ ఫ్యాన్స్ మదిలో కలకాలం నిలిచిపోవడం ఖాయం.
కెరీర్లో మూడు ఫిఫా ప్రపంచకప్‌లు సాధించిన ఏకైక ప్లేయర్ పీలే
1ప్రపంచకప్ ఫైనల్లో గోల్ చేయడంతో పాటు ట్రోఫీ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడు (1958లో17 ఏండ్లు)
8సాంటోస్ క్లబ్ తరఫున ఒకే మ్యాచ్‌లో పీలే ఎనిమిది గోల్స్ చేశాడు.
12 ఫిఫా ప్రపంచకప్‌లో పీలే చేసిన గోల్స్
92 అధికారిక, అనధికారిక ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో పీలే కొట్టిన హ్యాట్రిక్ గోల్స్
పూర్తి పేరు: ఎడ్సన్ అరాంటెస్ డో నాసిమెంటో(పీలే)
పుట్టిన తేదీ: అక్టోబర్ 23, 1940
పుట్టిన ప్రాంతం: ట్రెస్ కొరాకోస్, బ్రెజిల్
క్లబ్ కెరీర్: సాంటోస్ (1956-1974) న్యూయార్క్ కాస్మోస్ (1975-1977)
అంతర్జాతీయ కెరీర్
మ్యాచ్‌లు: 92,
గోల్స్: 77
అరంగేట్రం: 7/7/1957
చివరి మ్యాచ్: 18/7/1971
ప్రపంచకప్‌లు: (1958, 1962, 1970)
కోపా అమెరికా
ఫైనల్: (1959)
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ శతాబ్దపు అత్యుత్తమ ప్లేయర్(1999)
ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ: (2000)
గౌరవ బాలెన్ డీ ఓర్ (2014)
కెరీర్లో పీలే ఆడిన మొత్తం మ్యాచ్‌లు 1363
గోల్స్ 1281
బ్రెజిల్ ఆల్‌టైమ్ గోల్స్కోరర్ 77 గోల్స్
1959లో పీలే చేసిన గోల్స్ 127
క్లబ్ ఘనతలు
ఇంటర్నేషనల్ కప్ విన్నర్: (1962, 1963)
కోపా లిబార్టడొరెస్ విజేత: (1962, 1963)
సావోపౌలో స్టేట్ చాంపియన్: (1956, 58, 60, 61, 62, 64, 65, 67, 68, 69, 73)
బ్రెజిలియన్ కప్ విన్నర్: (1961, 62, 63, 64, 65, 68)
నార్త్ అమెరికన్ సాకర్ లీగ్: (1977)
రెస్ట్ ఇన్ పీస్ పీలే – లియోనల్ మెస్సీ
ఫుట్‌బాల్ రారాజు మనల్ని విడిచివెళ్లాడు. కానీ అతని వారసత్వం ఎన్నటికీ మరిచిపోనిది. రిప్ కింగ్
– కిలియన్ ఎంబాపె
కింగ్ పీలేకు కన్నీటి వీడ్కోలు. యావత్ ప్రపంచం పీలే ని ష్క్రమణతో కన్నీటి సంద్రమైంది. కోట్లాది మందికి అతడు స్ఫూర్తిదాయకం. ప్రతి సందర్భంలో అతను నా పట్ల చూపించిన ప్రేమ మరువలేనిది.
– క్రిస్టియానో రొనాల్డో
పీలే- ఎస్కేప్ టు విక్టరీ
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ‘ఎస్కేప్ టు విక్టరీ’ సినిమాలో పీలే నటించాడు. జాన్ హస్టన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పీలేతో పాటు సిల్వెస్టర్ స్టాలోన్, మైఖేల్ కేన్, ప్రముఖ ప్లేయర్లు కీలక పాత్రలు పోషించారు. పీలే ట్రేడ్‌మార్క్ షాట్ బైస్కిల్ కిక్‌ను ఈ సినిమాలో వాడటం విశేషం.