Chris Gayle : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)16వ సీజన్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) చెలరేగి ఆడాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతను వరుసగా రెండో సెంచరీతో ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(6 సెంచరీలు) రికార్డు బద్ధలు కొట్టడమే కాకుండా ఈ టోర్నీలో అత్యధికంగా 7 శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తాను నెలకొల్పిన రికార్డును కోహ్లీ అధిగమించడంపై ఆర్సీబీ మాజీ ఆటగాడైన గేల్ సరదాగా కామెంట్ చేశాడు.
‘కోహ్లీ కాచుకో.. నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే ఏడాది నాతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉండు’ అని గేల్ జోక్ చేశాడు. ఈ సీజన్లో బెంగళూరుకు చావోరేవే లాంటి రెండు మ్యాచుల్లో కోహ్లీ వంద కొట్టాడు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ బాది గేల్ రికార్డు సమం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కోహ్లీ శతకం బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 16వ సీజన్ జెర్సీ ఆవిష్కరణ సందర్బంగా ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఏబీ డివిలియర్స్‌తో పాటు క్రిస్ గేల్‌కు చోటు కల్పించిన విషయం తెలిసిందే.
ఆర్సీబీకి ఆడిన రోజుల్లో కోహ్లీతో గేల్
వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ తన ఆట, ప్రత్యేక ప్రవర్తనతో యూనవర్సల్ బాస్‌గా పేరొందాడు. ఐపీఎల్లో చితక్కొట్టిన అతను ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 2012, 2013 సీజనల్లో 700లకు పైగా రన్స్ కొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో పూణేపై సుడిగాలి(175 నాటౌట్) ఇన్నింగ్స్ ఆడాడు. ఆరు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే.. రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న గేల్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు.
పదహారో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానలను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. విరాట్ కోహ్లీ సెంచరీ బాదినా బౌలర్లు విఫలమవ్వడంతో మ్యాచ్ చేజారింది. ఆర్సీబీ ఓటమితో ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాలనుకున్న కోహ్లీ కల చెదిరింది. 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ నాలుగో బెర్తు దక్కించుకుంది. మే 23వ తేదీన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఢీ కొంటాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో ఫైనల్ బెర్తు కోసం తలపడుతుంది.