David Warner : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2023) 16వ సీజన్లో చెత్త ప్రదర్శన చేసిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఒకటి. పేలవమైన ఆటతో అందరి కంటే ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటితో లీగ్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ సీజన్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్(David Warner) తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ప్రపంచంలోని టీ20 లీగ్స్‌లో ఐపీఎల్ చాలా స్పెషల్’ అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చాడు.
‘మేము అనుకున్న ఫలితం రాలేదు. అయినా.. మీ అందరికీ థాంక్స్. ఈ సీజన్లో మాకు అన్నివిధాలా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ప్రియమైన అభిమానులారా.. మాపై మీకున్న నమ్మకం నిరంతరం మా అందరిలో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. వచ్చే ఏడాది మరింత ధ్రుడంగా ఉండి గొప్పగా ఆడతామని ఆశిస్తున్నాను.
Delhi Capitals skipper David Warner pens emotional note after DC crashes out of IPL 2023.#DelhiCapitals #DavidWarner pic.twitter.com/kjkfVCkwcw
— CricTracker (@Cricketracker) May 22, 2023
ఇప్పటి వరకు 16వ సీజన్‌ను ఓసారి గమనిస్తే.. ప్రపంచంలో ఐపీఎల్ ఎందుకింత గొప్పది అనే విషయం స్పష్టమవుతుంది. ఎన్నో ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు.. ఎంతో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లను చూశాం. నా ఇన్నేళ్ల అనుభవంలో ఇదే బెస్ట్ సీజన్’ అని వార్నర్ తన ట్విట్టర్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఢిల్లీ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 77 పరుగుల తేడాతో ఓడిపోయింది.
పదహారో సీజన్‌ను ఢిల్లీ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అవును.. సీజన్ ప్రారంభానికి రెండు నెలల ముందే రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. సర్జరీ కావడంతో అతను సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కొత్త కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. గత సీజన్లో చెలరేగిన ఓపెనర్ పృథ్వీ షా వైఫల్యం.. మిడిలార్డర్ ఫామ్ లేమి ఢిల్లీని వెంటాడాయి. దాంతో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. వార్నర్ ప్రతి మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. అయినా మనీశ్ పాండు, మిచెల్ మార్ష్, రిలే రస్సో రాణించకపోవడంతో విజయం దక్కలేదు. ఫిలిఫ్ సాల్ట్ రాకతో ఢిల్లీ గెలుపు బాట పట్టింది. కానీ, అప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి. ఢిల్లీ జట్టు 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.