చదరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఆరేండ్ల వయసులో పావులు కదపడం నేర్చిన ఈ హైదరాబాదీ.. పదిహేనేండ్ల వయసులోనే భారత 82వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు సాధించాడు. గత నెలలోనే మూడో జీఎం నార్మ్ దక్కించుకున్న ప్రణీత్.. తాజాగా 2500 ఎలో రేటింగ్ సాధించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: చదరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 82వ భారతీయ చెస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇటీవల స్పెయిన్ వేదికగా జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో మూడో జీఎం నార్మ్ దక్కించుకున్న ప్రణీత్.. గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను ఆదివారం సాధించాడు. బాకు ఓపెన్ తొమ్మిదో రౌం డ్లో టాప్ సీడ్ అమెరికాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ హన్స్ నేమాన్పై నెగ్గడంతో ప్రణీత్ మ్యాజిక్ ఫిగర్ దాటాడు. ఆరేండ్ల వయసులో ఆట ప్రారంభించిన ప్రణీత్.. దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి 15 ఏండ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు.
చిన్నప్పటి నుంచే వయసుకు మించిన ప్రతిభతో తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచిన ఆ చిన్నారి.. మూడేండ్లు నిండకముందే అన్నతో కలిసి బడిబాట పట్టాడు. స్విమ్మింగ్, టెన్నిస్, ఫుట్‌బాల్.. ఇలా ఆట ఏదైనా తనదైన ముద్ర వేసేందుకు తపించిన ఆ చిన్నారిని చదరంగం మరింత ఆకర్షించింది. ఆరేండ్ల వయసులో పావులు కదపడం నేర్చిన ఆ బుడతడు.. పదిహేనేండ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. కరోనా కారణంగా ఈ ఘనత అందుకునేందుకు ఆలస్య మైందంటున్న ఉప్పల ప్రణీత్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
చదరంగంపై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఫుట్‌బాల్, టెన్నిస్ ఆడేవాడిని. మేధస్సు పెంచుకోవాలనే ఉద్దేశంతో తల్లదండ్రులు ఉప్పల శ్రీనివాస్, ధనలక్ష్మి చెస్ వైపు ప్రోత్సహించారు.
సాధించిన ఘనతలు?
ఆరేండ్లప్పుడు చెస్ ఆడటం ప్రారంభించా.. ఏడేండ్లకు అండర్-7 స్టేట్ చాంపియన్‌గా నిలిచా. ఆ తర్వాత అండర్-14 వరకు ప్రతి ఏడాది వేర్వేరు వయో విభాగాల్లో అగ్రస్థానం దక్కించుకున్నా. అండర్-14లో నేషనల్ చాంపియన్‌గా నిలిచా. జూనియర్ స్థాయిలో ఆసియా చాంపియన్‌షిప్‌తో పాటు, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించా.
అభిమాన ఆటగాడు?
ఆట ప్రారంభించినప్పుడు విశ్వనాథన్ ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకునేవాడిని. ఆనంద్‌తో కలిసి ఆడినపుడు చాలా ఆనందం వేసింది. కార్ల్సన్ ఆట కూడా ఇష్టం.
భవిష్యత్తు లక్ష్యాలేంటి?
కెరీర్లో 2800 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం మరింత కష్టపడుతా. ఎప్పటికైన ప్రపంచ చాంపియన్‌గా నిలువాలనే కోరిక ఉంది.
చెస్‌లో తొలి గురువు ఎవరు?
కెరీర్ తొలినాళ్లలో నరసింహరావు దగ్గర శిక్షణ పొందా. ఆ తర్వాత చెస్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాక రామరాజు సార్ వద్ద చేరా. అప్పటి నుంచి చాన్నాళ్ల పాటు అక్కడే కోచింగ్ తీసుకున్నా. అక్కడ హర్ష భరత్‌కోటి, అర్జున్ ఇరిగైసిని దగ్గర నుంచి గమనించా. వాళ్లు గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నప్పుడు నాలో మరింత పట్టుదల పెరిగింది.
జీఎం హోదా దక్కడం ఎలా ఉంది?
దాదాపు పదేండ్లుగా చెస్ ఆడుతున్నా. ప్యాషన్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తేనే ఇక్కడ రాణించగలం. గత నెలలో మూడో జీఎం నార్మ్ సాధించినప్పుడు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు 2500 ఎలో రేటింగ్ దాటడంతో గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది. దేశంలో 82వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది..
రోజుకు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు?
క్లాసికల్ గేమ్‌లో గంటల తరబడి బోర్డుపై కూర్చోవాల్సి ఉంటుంది. చెస్ కేవలం మైండ్ గేమ్ అనుకుంటే పొరపాటు. సుదీర్ఘంగా కూర్చునే శక్తి ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి. ఎనిమిది గంటల పాటు ప్రాక్టీస్ చేస్తా. కరోనా కారణంగా ఆన్లైన్లోనే శిక్షణ సాగుతున్నది.
ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయా?
అంతర్జాతీయ టోర్నీలు ఆడటం ఖర్చుతో కూడుకున్న పని. అమ్మానాన్న ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో జాతీయ స్థాయి వరకు సజావుగా సాగినా.. అంతర్జాతీయ స్థాయికి చేరడం కోసం ఇళ్లు అమ్మాల్సి వచ్చింది. ప్రస్తుతం స్పాన్సర్స్ కోసం ఎదురుచూస్తున్నా.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశా. అప్పుడు సీఎం చెప్పిన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. దాదాపు పదిహేను నిమిషాల పాటు నాతో మాట్లాడి వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో మరింత రాణించాలని సూచించారు. ముఖ్యమంత్రి మాటలతో ఈ రోజు గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగా. సీఎం ప్రోత్సాహంతో మున్ముందు కూడా మరింతగా సత్తాచాటుతా.