లండన్: వింబుల్డన్‌లో హ్యాట్రిక్ టైటిల్ వేటలో ఉన్న కార్లొస్ అల్కరాజ్ ఆ దిశగా మరో ముందడుగు వేశాడు. రెండో సీడ్ స్పెయిన్ కుర్రాడు బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో.. 6-1, 6-4, 6-4తో ఒలివర్ టర్వెట్ (బ్రిటన్)ను ఓడించాడు. తొలి రౌండ్లో విజయం కోసం చెమటోడ్చిన అల్కరాజ్.. రెండో రౌండ్లో వరుస సెట్లలో గెలిచి మ్యాచ్‌ను ముగించాడు.
మంగళవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నొవాక్ జొకోవిచ్.. 6-1, 6-7 (7/9), 6-2, 6-2తో అలగ్జాండ్రె ముల్లర్ (ఫ్రాన్స్)ను చిత్తుచేసి టోర్నీలో శుభారంభం చేశాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సబలెంక.. 7-6 (7/4), 6-4 మేరీ బౌజ్కోవ (చెక్)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన అమెరికా అమ్మాయి కోకో గాఫ్ 6-7, 1-6తో డయానా (ఉక్రెయిన్) చేతిలో ఓడి తొలిరౌండ్‌కే ఇంటిబాట పట్టింది.
పురుషుల డబుల్స్‌లో యుకీ బాంబ్రీ (భారత్), రాబర్ట్ (యూఎస్) ద్వయం.. 7-6 (10/8), 6-4తో మాన్యుల్ (ఫ్రాన్స్), ఆర్నెడొ (మొనాకో)ను ఓడించి రెండో రౌండ్ చేరింది. మరో మ్యాచ్‌లో రిత్విక్ చౌదరి (భారత్), నికోలస్ (కొలంబియా) జోడీ కూడా మొదటి రౌండ్ విఘ్నాన్ని దాటినా సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న, సాండర్ (బెల్జియం) జంటకు పరాభవం తప్పలేదు.