అట్లాంటా: ఫిఫా వరల్డ్ కప్‌లో అతి పెద్ద సంచలనం. మాజీ చాంపియన్, ట్రోఫీ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్‌ను ప్రపంచకప్ అరంగేట్ర జట్టు కాబో వెర్డె నిలువరించి ఔరా అనిపించింది. యూరోపియన్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్‌ను ప్రపంచంలోనే మూడో అతిచిన్న దేశమైన కాబో వెర్డె అడ్డుకోవడంతో సాకర్ ప్రపంచం అవాక్కైంది. సోమవారం హోరాహోరీగా సాగిన గ్రూప్-హెచ్ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంకర్ స్పెయిన్‌తో పోరును 0-0తో డ్రా చేసిన 64వ ర్యాంకర్ కాబో వెర్డె తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప అధ్యాయాన్ని లిఖించింది. ఏకపక్షం అనుకున్న ఈ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ అభిమానులను ఫిదా చేసింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగిన స్పెయిన్ బంతిని 62 శాతం తమ నియంత్రణలోనే ఉంచుకున్నా.. లక్ష్యంపై 7 సహా మొత్తంగా 27 దాడులు చేసినా ఒక్కసారి కూడా సక్సెస్ కాలేకపోయింది.
కాబో వెర్డె (304 పాస్‌లు)తో పోలిస్తే పాస్ల్లోనూ పూర్తి పైచేయి సాధించినా ఫలితం లేకపోయింది. అత్యద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి దాడులను టీమ్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఆట చివర్లో ఇరు జట్ల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 90వ నిమిషంలో కాబో వెర్డెకు మ్యాచ్‌లోనే తొలి కార్నర్ లభించగా.. డినీ బోర్జెస్ తలతో కొట్టిన బంతిని స్పెయిన్ కీపర్ ఉనై సిమోన్ చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత 93వ నిమిషంలో కాబో ఆటగాళ్లు ముగ్గురు కలిసి స్పెయిన్ డిఫెన్స్‌పై కౌంటర్ ఎటాక్‌కు దూసుకెళ్లారు. ఆ దాడిని తిప్పికొట్టే క్రమంలో స్పెయిన్ స్టార్ మిడ్‌ఫీల్డర్ పెద్రి ఫౌల్ చేయాల్సి వచ్చింది. దీంతో రెఫరీ అతనికి ఎల్లో కార్డ్ చూపించాడు.
మ్యాచ్ ఆఖరి క్షణాల్లో (90+6వ నిమిషంలో) స్పెయిన్ ఆటగాడు మైకెల్ ఒయర్జబల్ కొట్టిన షాట్ మిస్ అవ్వడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫుల్-టైమ్ విజిల్ పడగానే కాబో వెర్డ్డె ఆటగాళ్లు తాము ప్రపంచ కప్‌నే గెలిచినంతగా సంబరాల్లో మునిగిపోయారు. మ్యాచ్ పొడవునా స్పెయిన్ దాడులను అడ్డుకుంటూ అద్భుత ప్రదర్శన చేసిన కాబో వెర్డె గోల్‌కీపర్ వోజిన్హా ఈ చారిత్రాత్మక ఫలితంతో వచ్చిన భావోద్వేగాన్ని తట్టుకోలేక మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. స్పెయిన్ తమ గోల్ పోస్టుపై కొట్టిన ఏడు షాట్లను అడ్డుకున్న వోజిన్హా మొత్తం 65 టచ్‌లు, 15 బాల్ రికవరీలు చేసి మ్యాచ్ హీరోగా మారి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆకర్షించాడు.
మాంటెర్రీ(మెక్సికో): తన తండ్రి పుట్టిన దేశంపై బరిలోకి దిగిన యువ స్ట్రయికర్ యాసిన్ అయారి డబుల్ గోల్స్‌తో విజృంభించడంతో ప్రపంచకప్‌లో స్వీడన్ అదిరిపోయే శుభారంభం చేసింది. గ్రూప్-ఎఫ్ పోరులో 5-1 తేడాతో ట్యునీషియాపై ఘన విజయం సాధించింది. గత మెగాటోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైన స్వీడన్ ఈసారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. 39వ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లో ప్రవేశించిన స్వీడన్..ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యువ ైస్ట్రెకర్ యాసిన్ అయారి (7ని, 90+6ని) రెండు గోల్స్‌తో సత్తా చాటగా.. అలెగ్జాండర్ ఇసాక్(30ని), విక్టర్ గ్యోకెరెస్(59ని), మథియస్ స్వాన్బెర్గ్(84ని) ఒక్కో గోల్ చేశారు. ట్యునీషియా తరఫున ఒమర్ రెకిక్(43ని) ఏకైక గోల్ చేశాడు. ఇదే గ్రూప్‌లో నెదర్లాండ్స్, జపాన్ మధ్య పోరు 2-2తో డ్రా అయింది. గ్రూప్-ఈ పోరులో ఐవరీకోస్ట్ 1-0తో ఈక్వెడార్‌పై గెలిచింది. అమద్ దియాలో(90ని) ఏకైక గోల్ చేశాడు.
ఇరాన్ x న్యూజిలాండ్
ఉ. 6.30 నుంచి
ఫ్రాన్స్ x సెనెగల్
రా. 12.30 నుంచి
ఇరాక్ xనార్వే
తె.జా. 3.30 నుంచి