Mumbai Indians : పంతొమ్మిదో సీజన్లో ఘోరమైన ఆటతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians).. ఇక పరువు కోసం పోరాడనుంది. పోతూ పోతూ ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయాలనుకుంటోంది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు సైతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అందుబాటులో ఉండడం లేదు. అలానే తాత్కాలిక నాయకుడు సూర్యకుమార్ యాదవ్ (Syryakumar Yadav) సైతం దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ముంబై సారథిగా వ్యవహరించనున్నాడని సమాచారం. అదే జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ముగ్గురు సారథులతో ఆడిన రికార్డు ముంబైకి సొంతమవ్వనుంది.
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పంతొమ్మిదో సీజన్లో ఏదీ కలిసి రాలేదు. జట్టు నిండా స్టార్లు, టీ20 వరల్డ్ కప్ విజేతలు ఉన్నా సరే అనూహ్యంగా లీగ్ దశను దాటలేదు ముంబై. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యూహాలు, పేలవ ఫామ్ అందుకు ఓ కారణం కాగా.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ముంబైని దెబ్బతీశాయి. దాంతో.. గత రెండు మ్యాచ్‌లకు పాండ్యాను పక్కన పెట్టిన ముంబై సూర్యకు పగ్గాలు అప్పగించినా ఫలితం మారలేదు. ఒకప్పుడు ప్రత్యర్థులను గడగడ వణికించిన ముంబై.. ఈసారి ఎనిమిది ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించడాన్ని యాజమాన్యం, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Jasprit Bumrah or Tilak Varma is expected to lead MI tonight in their clash against PBKS 🔵🏏
Source: Cricbuzz #JaspritBumrah #TilakVarma #IPL2026 #PBKSvMI #CricketTwitter pic.twitter.com/RmbD7f5UVI
— InsideSport (@InsideSportIND) May 14, 2026
ఈ పరిస్థితుల్లో మిగిలిన మ్యాచులన్నీ గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటున్న ముంబైని మూడో కెప్టెన్ నడపించడం ఖాయమనిపిస్తోంది. అవును.. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా, తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ అందుబాటులో ఉండడం లేదు. వీరిద్దరు జట్టుతో కలిసి నెట్స్‌లో పాల్గొనకపోవడమే అందుకు కారణం. దాంతో.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ ఉన్నప్పటికీ బుమ్రా లేదంటే తిలక్ వర్మలో ఒకరికి పగ్గాలు అప్పగిస్తారని సమాచారం.
సీనియరైన బుమ్రాకే యాజమాన్యం, కోచ్ మహేల జయవర్ధనే ఓటేసే అవకాశముంది. ఒకవేళ టాస్కు బుమ్రా వస్తే ఒకే సీజన్లో ముగ్గురు సారథులతో ఆడిన జట్టుగా ముంబై రికార్డు పట్టేయనుంది. 2013 నుంచి.. ఇప్పటివరకూ అంటే 13 ఏళ్లుగా ఫ్రాంచైజీ కోసం తన చెమటను ధార పోసిన అతిడికే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యమేమీ లేదు.
🚨 Hardik, Suryakumar unlikely for PBKS game!
⚡It is understood that both players haven’t reached Dharamsala yet
⚡Jasprit Bumrah and Tilak Varma are likely frontrunners to lead MI tonight #PBKSvsMI #IPL2026 pic.twitter.com/rBjdlq4M3i
— Cricbuzz (@cricbuzz) May 14, 2026
ఐపీఎల్లో ఆల్‌రౌండర్‌గా రాణించి.. కెప్టెన్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యా భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. గుజరాత్ టైటాన్స్‌కు అరంగేట్రంలోనే ట్రోఫీ అందించి.. ఆ తర్వాతి ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిపిన పాండ్యా ముంబై తరఫున అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. రెండు సీజన్లలోనూ అటు సారథిగా, ఇటు ఆటగాడిగా అతడు మెప్పించలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు సద్దుమణిగి.. అంతా పాండ్యా మాట వింటారు అనే సంకేతాలిచ్చినా ముంబై ఆట మారలేదు.

8 మ్యాచుల్లో 146 పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్.. బంతితో మరీ ఘోరంగా 4 వికెట్లే తీశాడు. 19వ సీజన్లో ముంబైని గెలిపించడంలో విఫలమైన పాండ్యాను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అతడిని అమ్మేసేందుకు ముంబై సిద్ధమైందనే కథనాలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తలపై ఫ్రాంచైజీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. చూస్తుంటే.. పొమ్మనలేక పొగబెట్టినట్టుగా పాండ్యా పరిస్థితి తయారైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రియురాలు మహీకా శర్మతో మైదానంలో నానా రచ్చ చేయడం కూడా పాండ్యాపై విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.