చాలాసార్లు చెప్పినట్లు ఆస్ట్రేలియాలో పుట్టినందుకు గర్విస్తున్నా. ఫైనల్ పోరులో ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేను. సొంత ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. కాస్త డీలాపడ్డ ప్రతిసారీ అభిమానులు నాలో జోష్ నింపారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే టైటిల్ సాధించగలిగా.
-బార్టీ, ఆస్ట్రేలియా ఓపెన్ విజేత
డబుల్స్ స్పెషలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఏడాది తిరిగే లోపే మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన అమ్మాయి!! మంచి జోష్‌లో ఉన్న సమయంలోనే టెన్నిస్‌కు బ్రేక్ ఇచ్చి క్రికెట్ బ్యాట్ పట్టింది. ఏదో సరదాగా ప్రాక్టీస్ ప్రారంభించిందేమో అనుకుంటే.. చూస్తుండగానే బిగ్‌బాష్ లీగ్‌లో అడుగుపెట్టి ఆల్‌రౌండర్‌గా అదరగొట్టింది! కట్ చేస్తే.. రెండేండ్లు తిరిగే సరికి మళ్లీ రాకెట్ చేత పట్టిన బార్టీ.. ఈసారి సింగిల్స్‌లో దుమ్మురేపింది. ఎదురులేని ఆటతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌కు
దూసుకెళ్లడంతో పాటు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది!!
ఎన్ని సాధించినా.. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు ప్రకటించిన ఆష్లే.. ఎట్టకేలకు సొంతగడ్డపై తన చిరకాల కోరిక
నెరవేర్చుకుంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో అమెరికా అమ్మాయిని చిత్తు చేసిన బార్టీ.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మహిళల సింగిల్స్ టైటిల్ ఖాతాలో వేసుకోగా.. పురుషుల సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో ఆదివారం మెద్వెదెవ్‌తో
నాదల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు!
మెల్బోర్న్: నాలుగు దశాబ్దాల అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్లేయర్ మెల్బోర్న్లో టైటిల్ పట్టింది. సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. 1978లో క్రిస్ ఓ నీల్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్ పట్టిన స్థానిక ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-3, 7-6 (7/2)తో 27వ సీడ్ డానిల్లె కొలిన్స్ (అమెరికా)ను చిత్తు చేసింది. బార్టీకి ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్లిన బార్టీ.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ ఖాతా తెరిచిన బార్టీ.. గతేడాది వింబుల్డన్‌లో విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి అప్రతిహతంగా దూసుకెళ్తున్న బార్టీ.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండానే టైటిల్ ఖాతాలో వేసుకోవడం విశేషం. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో అమెరికా ప్లేయర్లను మట్టికరిపించిన బార్టీ.. ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో టైటిల్ పట్టాక సంతోషంలో ఆనందభాష్పాలు రాల్చింది. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన బార్టీ.. తనపై నమ్మకముంచినందుకు అభిమానులకు శిరసు వంచి నమస్కరించింది.
అచ్చమైన ఆల్‌రౌండర్
స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న బార్టీకి రెండో సెట్లో అమెరికా ప్లేయర్ కొలిన్స్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక దశలో 1-5తో వెనుకబడిపోయిన నంబర్‌వన్ ప్లేయర్ ఇక తిరిగి కోలుకోవడం కష్టమే అనిపించింది. ఈ దశలో తదుపరి ఆరు గేమ్‌ల్లో ఐదింటిని చేజిక్కించుకున్న బార్టీ.. మ్యాచ్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లింది. అక్కడ కూడా తిరుగులేని ప్రదర్శన కొనసాగించిన బార్టీ.. వరుస పాయింట్లతో విజృంభించి సెట్‌తో పాటు టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఫైనల్ ఫైట్‌లో బార్టీ 10 ఏస్‌లతో విజృంభిస్తే.. కొలిన్స్ ఒక్కటంటే ఒక్క ఏస్‌కే పరిమితమైంది. బార్టీ 3 బ్రేక్ పాయింట్లు సాధిస్తే.. కొలిన్స్ రెండింటిని గెలుచుకుంది. కీలక టై బ్రేకర్‌లో తన అనుభవాన్నంతా రంగరించి సత్తాచాటిన బార్టీ.. అద్వితీయ సర్వీస్‌లతో ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేసింది. టెన్నిస్‌కు విరామం ఇచ్చి క్రికెట్లోనూ విశ్వరూపం కనబర్చిన బార్టీ.. శనివారం అచ్చమైన ఆల్రౌండర్లా విజృంభించింది. కోర్టు అంతా కలియతిరుగుతూ.. బేస్ లైన్, నెట్ గేమ్, సర్వీస్, రిటర్న్స్ ఇలా ఒక్కటేంటి ప్రతి అంశంలో స్పష్టమైన ఆధిక్యం కనబర్చిన 25 ఏండ్ల బార్టీ.. మెల్బోర్న్లో ట్రోఫీని ముద్దాడింది.
బార్టీ గ్రాండ్‌స్లామ్స్
టైటిల్స్ 3
ఫ్రెంచ్ ఓపెన్ (2019)
వింబుల్డన్ (2021)
ఆస్ట్రేలియా ఓపెన్ (2022)