ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. స్పిన్‌తో కంగారూలను కట్టడి చేద్దామనుకున్న టీమ్ఇండియా తాము పన్నిన వలలో తామే చిక్కుకుని విలవిలలాడుతున్నది. తొలి రోజు నుంచే సుడులు తిరుగుతున్న పిచ్‌పై భారత బ్యాటర్లు మరోమారు విఫలమయ్యారు. నాథన్ లియాన్ విజృంభణతో రోహిత్‌సేన కుప్పకూలింది. పుజార ఒంటరిపోరాటంతో చెప్పుకోదగ్గ స్కోరు అందుకున్న భారత్..ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆటలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప…ఇండోర్ టెస్టులో ఆసీస్ విజయానికి అడ్డు ఉండకపోవచ్చు.
ఇండోర్: బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్‌కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్‌ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమైంది. గురువారం ఆటలో మొత్తం 16 వికెట్లు పడితే..అందులో 12 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(8/64) ధాటికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు కుప్పకూలింది. చతేశ్వర్ పుజార(59) అర్ధసెంచరీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ లియాన్ వికెట్ల వేట కొనసాగించాడు. గిల్(5)తో మొదలైన భారత్ వికెట్ల పతనం సిరాజ్(0)వికెట్ వరకు దిగ్విజయంగా కొనసాగింది. లియాన్ సుడులు తిరిగే స్పిన్‌తో టీమ్ఇండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫలితంగా రోహిత్‌సేన ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 156/4 రెండోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 197 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్(3/44), ఉమేశ్‌యాదవ్(3/12) ఆసీస్ పతనాన్ని శాసించారు. బౌలింగ్‌కు ఆలస్యంగా దిగిన అశ్విన్ తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ఆసీస్ బ్యాటర్ల వెన్నువిరిచాడు. ఆఖర్లో ఉమేశ్ రివర్స్ స్వింగ్‌తో కంగారూల లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. జడేజా(4/78)కు నాలుగు వికెట్లు దక్కాయి.
ఇండోర్ టెస్టులో ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ స్పిన్ సునామీ సృష్టించాడు. పిచ్‌ను తనకు అనుకూలంగా మలుచుకుంటూ భారత బ్యాటర్ల పనిపట్టాడు. తన అద్భుత ఆఫ్‌స్పిన్ నైపుణ్యంతో టీమ్ఇండియాను బోల్తా కొట్టించడంలో లియాన్ పూర్తిగా సఫలమయ్యాడు. రాహుల్ స్థానంలో జట్టులోకొచ్చిన శుభ్‌మన్ గిల్..లియాన్ బౌలింగ్‌లో తొలివికెట్‌గా వెనుదిరిగాడు. స్పిన్‌ను సరిగ్గా అర్థం చేసుకోని గిల్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 15 పరుగుల తేడాతో కెప్టెన్ రోహిత్‌శర్మ(12) లియాన్‌కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. షాట్ ఆడే క్రమంలో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఔట్‌పై డీఆర్ఎస్కు వెళ్లినా..రోహిత్‌కు నిరాశే ఎదురైంది. ఓవైపు పుజార ఆసీస్ స్పిన్నర్లకు ఎదురొడ్డి నిలుస్తూ కీలక పరుగులు సాధించే ప్రయత్నం చేస్తే..విరాట్‌కోహ్లీ(13)మరోమారు నిరాశపరిచాడు. వచ్చి రావడంతోనే దూకుడు ప్రదర్శించిన శ్రేయాస్ అయ్యర్(26)..స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజ సూపర్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. శ్రీకర్ భరత్(3)ను లియాన్ క్లీన్‌బౌల్డ్ చేయగా, అశ్విన్(16), ఉమేశ్‌యాదవ్(0), సిరాజ్(0)ను లియాన్ వరుస విరామాల్లో ఔట్ అయ్యారు.
భారత్‌తో టెస్టుల్లో అత్యధిక(9) సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా లియాన్ నిలిచాడు. ఈ క్రమంలో మురళీధరన్(8) రికార్డును లియాన్ అధిగమించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్. భారత్ రెండో ఇన్నింగ్స్: 163 ఆలౌట్ (పుజార 59, అయ్యర్ 26, లియాన్ 8/64, స్టార్క్ 1/14)