మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్ జట్టు.. మూడో టెస్టులోనూ పరాజయం దిశగా సాగుతున్నది. టాపార్డర్ వైఫల్యంతో ఇంగ్లిష్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ సపోర్ట్ స్టాఫ్‌లో కరోనా కేసులు వెలుగు చూడటంతో అరగంట ఆలస్యంగా ప్రారంభమైన పోరులో.. ఓవర్‌నైట్ స్కోరు 61/1తో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 267 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మార్కస్ హారిస్ (76) హాఫ్‌సెంచరీతో రాణించగా.. వార్నర్ (38), ట్రావిస్ హెడ్ (27), స్టార్క్ (24), కమిన్స్ (21) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట నిలిచే సమయానికి 4 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. హమీద్ (7), క్రాలీ (5), మలన్ (0), లీచ్ (0) విఫలం కాగా.. జో రూట్ (12), బెన్ స్టోక్స్ (2) క్రీజులో ఉన్నారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉంది. సొంతగడ్డపై తొలి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సొంతం చేసుకున్న కంగారూలు.. ఈ టెస్టులనూ నెగ్గి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ పట్టేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
అదే తడబాటు..
సిరీస్ ప్రారంభం నుంచి వరుసగా విఫలమవుతూ వస్తున్న ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ రెండో ఇన్నింగ్స్‌లోనూ దాన్నే కొనసాగించింది. ఐదో ఓవర్ నాలుగో బంతికి జాక్ క్రాలీని స్టార్క్ బుట్టలో వేసుకోగా.. భారీ ఒత్తిడిలో క్రీజులోకి అడుగుపెట్టిన డేవిడ్ మలన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అరంగేట్ర పేసర్ స్కాట్ బొలాండ్ చక్కటి పేస్‌తో చెలరేగి హమీద్, లీచ్‌లను పెవిలియన్ పంపడంతో ఇంగ్లండ్ జట్టు 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రూట్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మరో మూడు రోజుల ఆట మిగిలున్న ఈ పోరులో ఫలితం తేలడం పక్కా కాగా.. మూడో రోజు తొలి సెషన్లో కంగారూ పేసర్లను ఎదుర్కొంటూ ఇంగ్లండ్ ఇంకెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి.
తలా కొన్ని..
బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లిష్ ఆటగాళ్లు కనీస పోరాటం కనబర్చకుండా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటవడంతో.. మానసికంగా పైచేయి సాధించిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించింది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి రోజే ఔటైనా.. మరో ఓపెనర్ హారిస్ యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నైట్‌వాచ్‌మన్ లియాన్ (10) కాసేపు పోరాడగా.. మార్నస్ లబుషేన్ (1), స్టీవ్ స్మిత్ (16) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఈ దశలో హారిస్‌కు హెడ్ సహకరించాడు. దీంతో 171/4తో ఆస్ట్రేలియా గాడినపడ్డట్లే కనిపించింది. ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించడంతో వీరిద్దరూ ఔట్ కాగా.. ఆఖర్లో కామెరున్ గ్రీన్ (17), అలెక్స్ కారీ (19), కమిన్స్, స్టార్క్ విలువైన పరుగులు జోడించి ఆస్ట్రేలియాకు 82 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించారు.