AUS vs AFG: మీరెప్పుడైనా యుద్ధభూమిలో తన రాజ్యం ఓటమి దిశగా సాగుతున్న క్రమంలో తోటి సహచరులంతా కాడి వదిలేసి, తనకూ ఒంటినిండా గాయాలైనా ఓ సైనికుడు తుదికంటా పోరాడి ప్రత్యర్థిని మట్టికరిపించడమే గాక తన దేశ జెండాను సగర్వంగా నిలపడాన్ని చూశారా..? చూడకుంటే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం ముంబైలో ఆస్ట్రేలియా –అఫ్గానిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్‌ను వెంటనే చూసేయండి. వాంఖెడేలో అలాంటి అద్భుతమే జరిగింది. ముంబైలో అఫ్గాన్ నిర్దేశించిన 292 పరుగుల ఛేదనలో 91-7గా ఉన్న ఆసీస్… ఈ స్థితిలో మ్యాచ్ గెలవడం పక్కనబెడితే కనీసం 150 అయినా కొడతారా..? అఫ్గాన్ సంచలనం నమోదుచేయడం లాంఛనమే.. అన్న క్రికెట్ అభిమానుల ఆశలను ఓ విధ్వంసకవీరుడు సమూలంగా తుడిచేశాడు.
ఎప్పుడెలా ఆడతాడో తెలియని ఆసీస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్, 21 ఫోర్లు, 10 సిక్సర్లు) అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒక్కో పరుగును కూడగడుతూ అర్థ సెంచరీ చేసిన మ్యాక్సీ.. ఆ తర్వాత గేర్ మార్చాడు. ఫోర్లు, బౌండరీలతో వాంఖెడేలో శివాలెత్తాడు. అవతలి ఎండ్‌లో ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (68 బంతుల్లో 12 నాటౌట్, 1 ఫోర్) ను ఉంచి ఆసీస్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాడు. సెంచరీ తర్వాత కాలిగాయం వేధించినా.. క్రీజు నుంచి కదలడానికి కాళ్లు సహకరించకున్నా పోరాటం విడవలేదు. మ్యాక్సీ పోరాట ఫలితంతో.. ఆసీస్ అద్భుతం చేసింది. 292 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఛేదించిన స్కోరులో మిగిలిన బ్యాటర్లంతా చేసింది 92 పరుగులైతే మ్యాక్సీ చేసింది 201. ఇది కదా వన్ మ్యాన్ షో అంటే..! ఇక మ్యాక్స్‌వెల్-కమిన్స్‌లు ఎనిమిదో వికెట్‌కు 170 బంతుల్లో 202 పరగులు జోడిస్తే అందులో కమిన్స్ చేసినవి 12 పరుగులు.
ఆసీస్‌కు ఆదిలోనే చుక్కలు..
292 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ను అఫ్గాన్ బౌలర్లు వణికించారు. నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌లు ఆసీస్‌కు ప్రారంభ ఓవర్లలోనే ఆసీస్‌కు చుక్కలు చూపించారు. నవీన్ ఉల్ హక్.. ట్రావిస్ హెడ్ (0)తో పాటు మిచెల్ మార్ష్ (11 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లను ఔట్ చేశాడు. అజ్మతుల్లా వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి డేవిడ్ వార్నర్ (29 బంతుల్లో 18, 3 ఫోర్లు) బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి బంతికే జోస్ ఇంగ్లిస్ (0) కూడా స్లిప్స్‌లో ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
మిడిలార్డర్ కకావికలం..
50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన క్రమంలో మార్నస్ లబూషేన్ (28 బంతుల్లో 14, 2 ఫోర్లు)తో కలిసి మ్యాక్స్‌వెల్ లు ఆరు ఓవర్ల పాటు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. కానీ రషీద్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీయబోయి లబూషేన్ రనౌట్ అయ్యాడు. రషీద్ 17వ ఓవర్లో నాలుగో బంతికి ప్రమాదకర స్టోయినిస్ (6)ను ఎల్బీగా వెనక్కిపంపాడు. అతడే వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి స్టార్క్(3) కూడా ఇక్రమ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
మ్యాక్స్‌వెల్ పోరాటం..
18.3 ఓవర్లలో 91-7గా ఉన్న ఆసీస్ ఓటమి ఖాయమే అనుకున్నారంతా. కానీ ఎప్పుడెలా ఆడతాడో తెలియని విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్ తనలోని అసలు ఆటను బయటకు తీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో ఆడుతూ అఫ్గాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. నూర్ అహ్మద్ వేసిన 22వ ఓవర్లో ఐదో బంతికి మ్యాక్సీ ఇచ్చిన క్యాచ్‌ను షాట్ ఫైన్ వద్ద ముజీబ్ మిస్ చేశాడు. దీనికి అఫ్గాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. దీనికి తోడు రెండు ఎల్బీ రివ్యూలు కూడా అతడికి అనుకూలంగా వచ్చాయి. 50 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న మ్యాక్సీ.. ఆ తర్వాత ఆగలేదు. ఒక ఎండ్‌లో కమిన్స్‌ను నిలబెట్టి అఫ్గాన్ బౌలర్లను ఆటాడుకున్నాడు. భారీ షాట్లు ఆడుతూ వారిలో గెలవాలనే ఆలోచనను, గెలుస్తామనే ఆశను తుడిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. ముజీబ్ వేసిన 32వ ఓవర్లో 4,6తో సెంచరీకి చేరువయ్యాడు. నూర్ అహ్మద్ వేసిన 33వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ చేయడానికి 50 బంతులు తీసుకున్న మ్యాక్సీకి.. తర్వాత యాభై పరుగుల కోసం 26 బంతులే అవసరమయ్యాయి. సెంచరీ తర్వాత మ్యాక్స్‌వెల్ దాడి మరింత పెరిగిపోయింది. కాలు నొప్పి వేధించినా మ్యాక్సీ సింగిల్స్ కోసం వెంపర్లాడకుండా బౌండరీలు బాదడం మీదే దృష్టి పెట్టడంతో ఆసీస్ లక్ష్యానికి మరింత చేరువైంది. గాయం వేధించినప్పుడు ఆసీస్ అతడిని రిటైర్డ్ కావాలని, తర్వాత బ్యాటర్‌ను పిలిచినా అతడు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ లైన్ దాటించి ఆసీస్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆఖర్లో ముజీబ్ వేసిన 47వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్ బాది డబుల్ సెంచరీ సాధించడంతో పాటు ఆసీస్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి డబుల్ సెంచరీ కాగా.. ఆసీస్ కు ప్రపంచకప్‌లలో ఇదే మొదటిది కావడం గమనార్హం.