Angelo Di Maria : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, వరల్డ్ కప్ హీరో ఆంజెల్ డి మరియా(Angelo Di Maria) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఏడాది తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం మరియా వెల్లడించాడు. వచ్చే ఏడాది అమెరికాలో జరిగే కోపా అమెరికా(Copa America 2024) కప్ తర్వాత ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటానని ఈ ఫార్వర్డ్ ప్లేయర్ తెలిపాడు. వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్‌లో భాగంగా బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో మరియా 78వ నిమిషంలో గోల్ చేశాడు. దాంతో, అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది.
‘కోపా అమెరికా కప్‌లో చివరిసారిగా అర్జెంటీనా జెర్సీ వేసుకోబోతున్నా. గుండెనిండా బాధతో నాకెంతో ఇష్టమైన జెర్సీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ ప్రయాణంలో నాకు వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. బ్రెజిల్‌తో మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు నిల్చొని అభినందనలు తెలపడం మర్చిపోలేను. జట్టు సభ్యులతో ప్రతి సెకన్ను నేను ఎంతో ఆస్వాదించాను. వాళ్లు లేకుంటే నా ప్రయాణానికి అర్థమే లేదు. జట్టులోని ప్రతిఒక్కరి మధ్య ఉన్న ఆప్యాయతా, అనుబంధం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని మరియా భావోద్వేగానికి గురయ్యాడు.
2008లో ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన మరియా అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2021 కోపా అమెరికా కప్ ఫైనల్లో మరియా సూపర్ గోల్‌తో జట్టును గెలిపించాడు. ఈ స్టార్ ప్లేయర్ ఇప్పటివరకూ నాలుగు వరల్డ్ కప్‌లు ఆడాడు. నిరుడు లియోనల్ మెస్సీతో పాటు తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఖతార్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో మరియా అద్భుత గోల్ చేశాడు. ఈ స్టార్ ఆటగాడు తన 15 ఏండ్ర కెరీర్లో అర్జెంటీనా తరఫున 136 మ్యాచులు ఆడాడు. రియల్ మాడ్రిడ్, పీఎస్జీ, జువెంటస్, మాంచెస్టర్ యునైటెడ్ వంటి క్లబ్స్‌కు కూడా మరియా ప్రాతినిధ్యం వహించాడు.