భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఏడేళ్లపాటు భారత టెస్టు జట్టుకు సారధ్యం వహించిన కోహ్లీ.. ఎన్నో మరపురాని విజయాలనందించాడు. కానీ సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ నెగ్గాలనే కల మాత్రం కలగానే మిగిలిపోయింది.
ఈ సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఈ క్రమంలో విరాట్ భార్య, నటి అనుష్క శర్మ తన భర్తపై ఒక సుదీర్ఘ పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో తన భర్త గురించి మాట్లాడిన అనుష్క ఎన్నో అంశాలను టచ్ చేసింది. ఇంకా ఆమె ఏమన్నదంటే?..
‘‘2014లో నాకు ఆ రోజు ఇంకా గుర్తే. ధోనీ టెస్టుల నుంచి రిటైరవుతూ నిన్ను కెప్టెన్ చేశాడని నాకు చెప్పావు. నువ్వు, ధోనీ, నేను కాసేపు ఇదే విషయంపై మాట్లాడుకున్నాం. అప్పుడు ధోనీ జోక్ చేస్తూ కెప్టెన్ అయిన తర్వాత జుట్టు తొందరగా తెల్లబడిపోతుందని ఆటపట్టించాడు. అందరం నవ్వుకున్నాం.
కానీ ఈ ఏడేళ్లలో కేవలం నీ గడ్డం తెల్లబడటమే కాదు.. నీలో ఎదుగుదలను, చాలా గొప్ప ఎదుగుదలను చూశా. భారత టెస్టు జట్టు సారధిగా నీ చుట్టూ, నీలో కనిపించిన ఆ ఎదుగుదలను, నీ కెప్టెన్సీలో జట్టు సాధించిన విజయాలను చూసి గర్విస్తున్నా. ఈ విజయాల కన్నా నీలో నువ్వు సాధించిన ఎదుగుదలే నాకు ఎక్కువ గర్వకారణం.
2014లో మనం చిన్నవాళ్లం, అమాయకులం. మంచి ఆలోచనలు, పాజిటివ్‌గా ఉండటం, లక్ష్యాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నాం. కానీ సవాళ్లు తప్పవు కదా. అలాగే వీటిలో చాలా సవాళ్లు మైదానంలోనే ఎదురుకావు. ఎంతైనా ఇది జీవితం కదా! అసలు ఊహించని విషయాల్లోనే మనల్ని పరీక్షిస్తుంది.
ఈ విషయంలో ఇలాంటి ఎన్ని సమస్యలొచ్చినా నీ మంచి నిర్ణయాలకు అడ్డుపడకుండా చూసుకున్నందుకు నిన్ను చూసి చాలా గర్విస్తున్నా ప్రియా. నువ్వు మైదానంలో గెలిచేందుకు నీ శరీరంలోని శక్తినంతా ధారపోశావు. కొన్ని ఓటముల తర్వాత కళ్లనిండా నీళ్లతో గెలవడానికి నేనింకా ఏమైనా చేసుండాల్సింది అంటున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చున్న రోజులున్నాయి.
అదే నువ్వు, అందరూ అలాగే ఉండాలని అనుకుంటావు. నువ్వు మడి కట్టుకు కూర్చోవు, ముక్కుసూటిగా ప్రవర్తిస్తావు. సహనం నీకు శత్రువు. ఈ లక్షణాలే నిన్ను నాతోపాటు నీ అభిమానుల దృష్టిలో గొప్పవాణ్ణి చేశాయి. ఎందుకంటే వీటన్నింటి కింద నీ స్వచ్ఛమైన, కలుషితం కాని భావాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ విషయం అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు.
నేను చెప్పాను కదా.. కంటికి కనిపించే దాని వెనుక నువ్వేంటో అర్థం చేసుకున్న వాళ్లు నిజంగా గొప్పవాళ్లు. నువ్వు పర్ఫెక్ట్ కాదు. కొన్ని లోపాలున్నాయి. కానీ వాటిని నువ్వెప్పుడు దాచే ప్రయత్నం చేశావు? ఎప్పుడూ మంచి చేయడం కోసమే ముందుకొస్తావు. అది ఎంత కష్టమైనా! ఎప్పుడూ నువ్వే ముందుంటావు.
నువ్వు దేన్నీ స్వార్ధంతో పట్టుకొని ఉంచుకోలేదు. చివరకు ఈ స్థానాన్ని కూడా అది నాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా దేన్నయినా చాలా గట్టిగా పట్టుకుంటే తమకు తాము సరిహద్దులు విధించేసుకుంటారు. కానీ నువ్వు.. ప్రియా అపరిమితం. నీకు హద్దులు లేవు.
ఈ ఏడేళ్ల కాలంలో తన తండ్రి నేర్చుకున్న పాఠాలను మన కూతురు కూడా భవిష్యత్తులో చూస్తుంది’’ అంటూ అనుష్క సుదీర్ఘ పోస్టు చేసింది. పోస్టు చేసిన గంటలోనే దీనికి సుమారు 13 లక్షల లైకులు వచ్చాయి.