శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 12:42:39

కోహ్లి వ‌ద్దు.. ర‌హానేకే కెప్టెన్సీ ఇవ్వండి!

కోహ్లి వ‌ద్దు.. ర‌హానేకే కెప్టెన్సీ ఇవ్వండి!

న్యూఢిల్లీ: ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాలో చారిత్ర‌క విజ‌యం సాధించిన త‌ర్వాత కోహ్లిని దించి ర‌హానేకు కెప్టెన్సీ ఇవ్వాల‌న్న డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా మాజీ లెఫ్టామ్ స్పిన్న‌ర్ బిష‌న్ సింగ్ బేడీ కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ఇండియ‌న్ టీమ్‌కు కోహ్లిలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మ‌న్ కావాలో తేల్చుకోవాల‌నీ అత‌ను అన‌డం విశేషం. టెస్టుల్లో ర‌హానే, వ‌న్డేలు, టీ20ల‌కు రోహిత్, కోహ్లిలు కెప్టెన్సీలు చేప‌డితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే సెల‌క్ట‌ర్లు ఈ ధైర్యం చేయ‌లేర‌ని అన్నాడు. కోహ్లియే ముందుకు వ‌చ్చి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ర‌హానేకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంద‌ని బేడీ అన‌డం గ‌మ‌నార్హం. 

ర‌హానే అద్భుతం

ఇక ఆస్ట్రేలియాలో ర‌హానే కెప్టెన్సీ చూసి అత‌నికి తాను పెద్ద అభిమానిని అయిపోయాన‌ని బేడీ అన్నాడు. త‌న చుట్టూ ఓ గాయ‌ప‌డిన టీమ్‌ను ముందుండి న‌డిపించిన తీరు అద్భుత‌మ‌ని కొనియాడాడు. బౌలింగ్ వ‌న‌రుల‌ను వాడుకున్న తీరు అమోఘ‌మ‌న్నాడు. ర‌హానేను చూస్తుంటే త‌న‌కు టైగ‌ర్ ప‌టౌడీ కెప్టెన్సీయే గుర్తుకు వ‌స్తున్న‌ద‌ని బేడీ అన‌డం విశేషం. పటౌడీ స‌మ‌యంలోనూ త‌న‌కు త‌గిన వ‌న‌రులు లేక‌పోయినా.. త‌న కెప్టెన్సీతో టీమ్‌ను విజ‌యాల బాట ప‌ట్టించేవాడ‌ని, ఇప్పుడు ర‌హానే కూడా అదే ప‌ని చేస్తున్నాడ‌ని బేడీ చెప్పాడు. బౌలింగ్ వ‌న‌రుల‌ను వాడుకోవ‌డంలోనే ఓ కెప్టెన్ సామ‌ర్థ్యం ఏంటో తెలుస్తుంద‌ని, ఆ విష‌యంలో ర‌హానే పూర్తిగా విజ‌య‌వంత‌మ‌య్యాడ‌ని అన్నాడు. కెప్టెన్సీ 90 శాతం ల‌క్‌.. ప‌ది శాతం నైపుణ్యం.. కానీ ఆ ప‌ది శాతం లేక‌పోతే మాత్రం దానిని ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని రిచీ బెనాడ్ చెప్పిన విష‌యాన్ని బేడీ గుర్తు చేశాడు. ర‌హానే విష‌యంలో మాత్రం 50 శాతం ల‌క్‌, 50 శాతం నైపుణ్యం ఉన్న‌ద‌ని కొనియాడాడు. కోహ్లి బ్యాటింగ్ కెరీర్ ఎక్కువ కాలం కొన‌సాగాలంటే కెప్టెన్సీని ర‌హానేకు అప్ప‌గించాల‌ని అత‌డు స్ప‌ష్టం చేశాడు. 

VIDEOS

logo