భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పండుతున్నది. ప్రపంచంలోనే ఖరీదైన లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో వేల కోట్లు పలుకుతున్నాయి. టెలివిజన్, డిజిటల్, నాన్ ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ రైట్స్, ఉపఖండం అవతల ఇలా నాలుగు కేటగిరీల్లో హక్కులు దక్కించుకునేందుకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కోట్లు గుమ్మరిస్తున్నాయి. తొలి రోజుకు కొనసాగింపుగా సోమవారం జరిగిన వేలంలో టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల ద్వారా 46,000 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. మిగిలిన రెండు ప్యాకేజీలు కలుపుకుంటే బోర్డు అంచనా వేసినట్లు 50వేల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కోట్లకు కోట్లు వచ్చి పడుతున్నాయి. కో అంటే కోటి అన్నట్లు కార్పొరేట్ కంపెనీలు కోట్లు గుమ్మరించేందుకు పోటీపడుతున్నాయి. రానున్న ఐదేండ్ల(2023-27) కాలానికి జరుగుతున్న ఐపీఎల్ వేలం హోరాహోరీ పోరును తలపిస్తున్నది. ఒకరిని మించి మరొకరు బిడ్లు దాఖలు చేస్తూ హక్కులు దక్కించుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఫలితంగా బోర్డు అంచనాలకు అనుగుణంగా కోట్ల ఆదాయం వచ్చిపడుతున్నది. ఆన్లైన్ ద్వారా రెండో రోజు సోమవారం జరిగిన వేలం కడదాకా ఉత్కంఠగా కొనసాగింది. ముఖ్యంగా ప్యాకేజీ-ఏలో భాగంగా ఉపఖండం లోపల 410 మ్యాచ్‌ల టెలివిజన్ హక్కులకు రికార్డు స్థాయిలో రూ.23,575 కోట్లు పలికింది. ఒక్కో మ్యాచ్ పరంగా చూసుకుంటే ఇది రూ.57.5 కోట్లు. మరోవైపు ప్యాకేజీ-బి(డిజిటల్ రైట్స్) ఒక్కో మ్యాచ్‌కు రూ.50 కోట్ల చొప్పున రూ.20,500 కోట్లు ధర పలికింది. మొత్తంగా రెండు ప్యాకేజీలు కలిపి బోర్డుకు రూ.44, 075 కోట్లు సమకూరాయి. టెలివిజన్ హక్కులను స్టార్ ఇండియా, డిజిటల్ రైట్స్ రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ దక్కించుకున్నట్లు సమాచారం తెలిసినా..బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. ప్యాకేజీ-సీ(నాన్ ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ రైట్స్)లో ఐదేండ్లకు 98 మ్యాచ్‌ల కోసం సాయంత్రం 6 గంటల వరకు వేలం కొనసాగింది. ఈ సమయానికి బోర్డు మరో 2వేల కోట్లు దక్కాయి. ప్యాకేజీ -డీ కోసం కనీస ధరను రూ.3 కోట్లుగా ప్రకటించారు. ఉపఖండం అవతల ప్రసారాల కోసం జీ సంస్థ పోటీపడుతున్నది. మొత్తంగా మంగళవారం ఐపీఎల్ ప్రసార హక్కులపై పూర్తి స్పష్టత వస్తుందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఐపీఎల్ ప్రసార హక్కులు(2023-27)
మొత్తం మ్యాచ్‌లు: 410
ఒక్కో మ్యాచ్‌కు: రూ.107.5 కోట్లు
టెలివిజన్ రైట్స్ ఒక్కో మ్యాచ్‌కు: రూ.57.5 కోట్లు
డిజిటల్ రైట్స్ ఒక్కో మ్యాచ్‌కు: రూ.50 కోట్లు
టీవీ హక్కుల ఖరీదు: రూ.23,575కోట్లు
డిజిటల్ హక్కుల మొత్తం: రూ.20,500 కోట్లు
మొత్తం: రూ.44,075 కోట్లు