హాంగ్జ్జౌ: పదిహేను రోజుల పాటు అభిమానులను అలరించిన ఆసియాగేమ్స్‌కు ఆదివారం తెరపడింది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో గతానికి పూర్తి భిన్నంగా జరిగిన ఆసియాగేమ్స్ క్రీడాభిమానుల మదిలో కలకాలం గుర్తుండిపోనుంది. ఆసియా ఖండంలోని 45 దేశాలకు చెందిన 12వేలకు మంది అథ్లెట్లు పోటీపడ్డ మెగాటోర్నీలో ఆరంభ వేడుకులకు ఏ మాత్రం తగ్గకుండా ముగింపు కార్యక్రమాన్ని జిల్జిల్ జిగేల్ అనే రీతిలో నిర్వహించారు. చైనా దేశ సంస్కృతిని, వారసత్వానికి అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లాయి. 75 నిమిషాల పాటు బిగ్ లోటస్ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు, అథ్లెట్ల సమక్షంలో జరిగిన ముగింపు ఉత్సవాలు అందరినీ మైమరిపించాయి.
ముఖ్యంగా హాంగ్జౌ జ్ఞాపకాల అనే థీమ్‌తో పాటు వెయ్యి ఏండ్ల తమ దేశ వారసత్వానికి ప్రతీకగా ‘లోటస్ అండ్ ఒస్మాంతస్’ కనులకు ఇంపుగా జరిగాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన హాంగ్జౌ ఆసియాగేమ్స్‌లో అంచనాలకు మించి ఫలితాలు నమోదయ్యాయి. భారత్(28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) నాలుగో స్థానంలో నిలిచింది. భారత సీనియర్ హాకీ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్ జాతీయ పతాకధారిగా వ్యవహరించగా, దాదాపు 100 మంది అథ్లెట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్(వోసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్‌సింగ్ 19వ ఆసియాగేమ్స్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. 2026లో ఐచీ-నగోయా(జపాన్) ఆసియా క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.
ఇదే స్ఫూర్తితో..
హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అంచనాలకు మించి రాణించారు. 70 ఏండ్ల సుదీర్ఘ ఆసియా క్రీడల చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి ఔరా అనిపించారు. గత రికార్డులను తిరుగరాస్తూ కొత్త చరిత్ర లిఖించారు. ఇస్ బార్ సౌ పార్ అన్న నినాదాన్ని అనుగుణంగా ఆది నుంచే తాము పోటీకి దిగిన ప్రతీ విభాగంలో సత్తాచాటారు. అథ్లెటిక్స్, షూటింగ్ లాంటి విభాగాల్లో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పతకాల పంట పండించారు. ఈ క్రమంలో గత రికార్డులను తిరుగరాస్తూ పతకాలు ఒడిసిపట్టుకున్నారు. షూటింగ్లో మన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ స్వర్ణం సహా మూడు రజత పతకాలతో మెరువగా, బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యాన్ని ముద్దాడింది. హెప్టాథ్లాన్‌లో ఎస్సీ గురుకుల మణిపూస అగసర నందిని కాంస్య పతకంతో నయా చరిత్ర లిఖించింది. క్రికెట్లో తిలక్‌వర్మ, ట్రాప్ షూటింగ్లో కైనాన్ చినాయ్ పతకాలతో ప్రతిభ చాటారు. మొత్తంగా హాంగ్జౌ స్ఫూర్తితో రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేట కొనసాగించాలని ఆశిద్దాం.