దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ షాపింగ్‌లో డెలివరీ చేసిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు.
ఓ వ్యక్తి అమెజాన్ యాప్ ద్వారా కోల్గేట్ మౌత్‌వాష్ ఆర్డర్ చేస్తే అతనికి రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేశారు. నేను ఆర్డర్ చేసింది కాకుండా వేరొకటి పంపించారని ఆ ఫోన్‌ను తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
హలో అమెజాన్. నేను కోల్గేట్ మౌత్‌వాష్‌ను ఆర్డర్ చేశాను. దానికి బదులుగా రెడ్మీ నోట్ 10 మొబైల్ వచ్చింది. మౌత్ వాష్ నిత్యావసర వస్తువు కాబట్టి యాప్ ద్వారా రిటర్న్ చేయడానికి అవకాశం లేదు. ప్యాకేజీని ఓపెన్ చేసినప్పుడు ప్యాకేజింగ్ లేబుల్ మాత్రం నాపేరు మీదే ఉంది.
కానీ, ఇన్వాయిస్ వేరొకరిది. ఫోన్ ఆర్డర్ చేసిన వారికి ఈ ప్రొడక్ట్‌ను నా దగ్గర నుంచి తీసుకొని సరైన వ్యక్తికి అందించాలని ఇప్పటికే నేను మెయిల్ కూడా పంపాను అని లోకేశ్ దగా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. లోకేశ్ నిజాయితీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.