AI for Lay-offs | సాఫ్ట్వేర్ రంగంలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం శరవేగంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు తరిగిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నదన్న భయంతో టెక్నాలజీ సంస్థలు పొదుపు చర్యల పేరిట భారీగా ఉద్యోగుల ఉద్వాసన పలుకుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల స్థానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోల వాడకం వల్ల నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడమే కాదు.. ఉద్యోగుల ఉద్వాసనకు కూడా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ టూల్‌నే వినియోగిస్తున్నారని సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువ ఆధారపడటం కొత్త కాదు.. ఒకసారి వినియోగిస్తే టెక్నాలజీ రంగంలో త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు వీలవుతున్నదని.. అందుకే లే-ఆఫ్స్ ఉద్యోగుల జాబితా తయారు చేయడానికి కూడా దీన్ని వాడుతున్నారని తెలిసింది.
ఔట్‌ప్లేస్‌మెంట్ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ కథనం ప్రకారం గత నెలలో అమెరికాలో దాదాపు 42 వేల మంది టెక్నాలజీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. టెక్ రీసెర్చ్ సంస్థ గార్టనర్ అనుబంధ సంస్థ కాప్టెరా కథనం ప్రకారం ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ముంచుకొస్తే ఉద్యోగుల తగ్గింపునకు హెచ్ఆర్ నిపుణుల్లో 98 శాతం కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్, ఆల్గోరిథమ్ వంటి టూల్స్‌పైనే ఆధార పడుతున్నారని సర్వేలో తేలింది.
అసైన్ చేసిన విధులు, లక్ష్యాలను చేరుకోలేకపోయిన ఫ్లెక్స్ డెలివరీ డ్రైవర్లను అల్గోరిథం గుర్తించిన తర్వాత ఇచ్చిన జాబితా మేరకు వారిలో కొందరిని 2021లో అమెజాన్ తొలగించినట్లు బ్లూంబర్గ్ న్యూస్ పేర్కొంది. ఆఫీసులో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఈ స్క్రూటినీ నుంచి తప్పించుకున్నారు. కానీ, వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ స్కోర్స్‌కు పాపులారిటీ పెరిగినా కొద్దీ.. వారి పనితీరు ట్రాక్ చేయడం కూడా సాధ్యమేనట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే రోబోలు.. కంప్యూటర్‌పై ఉద్యోగుల ప్రొడక్టివిటీ స్కోర్ ఆధారంగా వారి పనితీరును అంచనా వేసి లే-ఆఫ్స్ జాబితాలో చేరుస్తున్నాయని తెలుస్తున్నది.
ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులను సార్ట్ఔట్ చేయడానికి అమెజాన్ ఒక ఆటోమేటెడ్ టూల్ క్రియేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల గత ఉద్యోగాల చరిత్ర, శిక్షణ తదితర అంశాలపై సదరు టూల్‌కు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ టూల్ కొత్త కొలువుల ఎంపికలో పురుషులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు మహిళలను పక్కనబెట్టినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో సదరు ఆటోమేటెడ్ టూల్ వినియోగాన్ని అమెజాన్ నిలిపేసిందని తెలిసింది.