భావితరాలకు.. చరిత్ర తెలిసేలా..
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్‌పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు.
- అద్భుత పర్యాటక క్షేత్రంగా బన్సీలాల్‌పేట మెట్ల బావి
- మంత్రి కేటీఆర్, తలసానిల ప్రత్యేక చొరవతో పునరుద్ధరణ
- బావి పునరుద్ధరణతో పెరిగిన భూగర్భ జలాలు
చరిత్ర కండ్ల ముందు కనిపిస్తే ఆ అనుభూతే వేరు. చరిత్రను తెలుసుకునేందుకు ఖండాలు దాటి.. సముద్రాల్లో మునిగేవాళ్లకు లెకేలేదు. అలాంటిది హైదరాబాద్ మహానగరంలో రాజుల కాలం నాటి ఓ బావి ఇప్పుడు వెలుగులోకి వచ్చి అద్భుత క్షేత్రంగా దర్శనమిస్తున్నది. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో కొన్ని శతాబ్దాల పాటు సేవలందించి, దశాబ్దాలుగా నిరాదరణకు గురై.. రూపు రేఖలు కోల్పోయిన చారిత్రక మెట్లబావి ఇప్పుడు తెలంగాణ సరారు చొరవతో మళ్లీ జీవం పోసుకున్నది. అంతేకాదు గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి రూపుదిద్దుకున్నది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్‌పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. అయితే కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయింది. ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. దాదాపు 5 వందల మెట్రిక్ టన్నుల మట్టి, చెత్తను తొలగించారు. మట్టి తీస్తున్న కొద్దీ పురాతన వస్తువులు బయట పడ్డాయి. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న బావి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ చెప్పారు. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతున్నది. బావి చుట్టు పక్కల ప్రాంతాలలో బోర్లన్నీ భూగర్భ జలాలతో నిండుగా ఉన్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అసఫ్-జాహీ కాలంలో నిర్మాణం

సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని అసఫ్-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఆంగ్లేయుల కాలంలో సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టీహెచ్ కీస్ ఈ బావిని 1933లో పునరుద్ధరించారు. అందుకు సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్‌పేట్ అని నిలిచిపోయింది.

మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం
మెట్లబావిని పునరుద్ధరించడానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రొత్సాహం అందించడంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డితో కలసి అనేక సార్లు పర్యటించారు. బావిలో నుంచి పూడికతీత, చుట్టూ సీసీ రోడ్లు జీహెచ్ఎంసీ పూర్తి చేయగా, బన్సీలాల్‌పేట్ ప్రధాన ద్వారం, బాహ్య కట్టడాల పరిరక్షణ చర్యలను హెచ్ఎండీఏ చేపట్టింది. అలాగే, బావి పక్కనే ఉన్న మైదానంలో పాత భవనం తొలగించి, కొత్తగా టూరిస్ట్ ప్లాజా భవనం నిర్మించి, ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌ను తీర్చిదిద్దారు. ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ఓపెన్ యాంపీ థియేటర్, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, బావి చరిత్రను వివరించే ఫొటో ప్రదర్శనకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అద్భుతంగా తీర్చిదిద్దిన మెట్ల బావి గురించి ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారు.

ఇలాంటి బావులను కాపాడుకోవాలి
పురాతన కట్టడాల పరిరక్షణకు తెలంగాణ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నేను చిన్నప్పుడు ఈ బావిలోనే ఈత కొట్టేవాడిని. బన్సీలాల్‌పేట ప్రజలు ఈ బావి నీటిని వాడుకునేవారు. స్థానికుల కోరిక మేరకు మంత్రి కేటీఆర్ చొరవతో పురపాలక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థతో కలిసి బావి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాం. భావితరాలకు చరిత్రను తెలియజేసే ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాలి.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

