బొంరాస్‌పేట, నవంబర్ 18 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. అధిక వడ్డీ రుణ భారం నుంచి మహిళా స్వయం సహాయక సభ్యులను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు ప్రతిష్టాత్మకంగా 2011 నుంచి స్త్రీనిధి రుణ పథకాన్ని అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, ఒంటరి స్త్రీలు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, భూమిలేని కుటుంబాలవారి ఆదాయాభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇస్తున్న స్త్రీనిధి రుణాలు వారి జీవనోపాధులను మెరుగుపరుస్తున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచేలా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు దోహదపడుతున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు.
సభ్యురాలికి కనిష్టంగా రూ.5వేలు.. గరిష్టంగా 3లక్షల రుణం
పొదుపు సంఘంలో సభ్యులైన మహిళలకు స్త్రీనిధి ద్వారా జీవనోపాధుల కోసం రుణాలను అందజేస్తారు. సభ్యురాలు సంఘంలో ఆరు నెలల కిందట చేరి ఉంటే రుణం పొందడానికి అర్హురాలు. ఒక మహిళకు కనిష్టంగా రూ.5 వేలు, గరిష్టంగా రూ.3లక్షలు స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా రుణాన్ని మంజూరు చేస్తారు. తీసుకున్న రుణ మొత్తాన్ని బట్టి రెండేండ్ల నుంచి ఐదేండ్లలోపు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐ రూపంలో రుణాన్ని చెల్లించాలి. రుణం పొందిన మహిళ చనిపోతే తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ఎన్ని ఈఎంఐలు చెల్లిస్తే అంత మొత్తం చనిపోయిన సభ్యురాలి కుటుంబానికి తిరిగి చెల్లిస్తారు. అంతేకాకుండా సురక్ష-బి పథకం ద్వారా రూ.లక్ష బీమా సహాయం అందజేస్తున్నారు. స్త్రీనిధి రుణాలు పొందిన మహిళలు తమ స్వయం ఉపాధి కోసం రకరకాల యూనిట్లను ఎంపిక చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. బర్రెలు, మేకల పెంపకం, వీధి దుకాణాలు, వీధి వ్యాపారాలు, టెంట్‌హౌజ్, చిన్న చిన్న పరిశ్రమలు వంటి వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ ఏడాది రూ.31.37కోట్ల స్త్రీనిధి రుణాల పంపిణీ
వికారాబాద్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.79.83కోట్ల స్త్రీనిధి రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఉంది. ఇప్పటివరకు రూ.31.37కోట్ల రుణాలను అందజేశారు. 40 శాతం మేర లక్ష్యాన్ని పూర్తి చేశారు. 359 గ్రామ సంఘాలు, 1793 పొదుపు సంఘాలను కవర్ చేస్తూ 4632 మంది మహిళలకు స్త్రీనిధి రుణాలను అధికారులు పంపిణీ చేశారు. మిగిలిన లక్ష్యాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు చేరుకోవడానికి కృషి చేస్తున్నారు. స్త్రీనిధి రుణాలు, జీవనోపాధులు, తిరిగి చెల్లింపులపై అధికారులు మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. రుణాలు తీసుకున్న మహిళలు జీవనోపాధి పొందుతూ ఆర్థికంగా ఎదుగుతూ రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు.
స్త్రీనిధితో ఉపాధి
– వడ్ల శాంతమ్మ, బొంరాస్‌పేట
ప్రగతి పొదుపు సంఘంలో చేరి 11 సంవత్సరాల నుంచి సభ్యురాలిగా ఉన్నా. స్త్రీనిధి పథకం ద్వారా రూ.3లక్షల రుణం తీసుకుని నా కొడుకుకు టెంట్‌హౌజ్ పెట్టించా. టెంట్‌హౌజ్ ద్వారా ఉపాధి పొందుతూ నెలకు రూ.7వేలు రుణ వాయిదాను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం స్త్రీనిధి ద్వారా వచ్చినందుకు సంతోషంగా ఉంది.
లక్ష్యం చేరుకోవడానికి కృషి
– కృష్ణన్, డీఆర్డీవో
బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యం జిల్లాలో ఈ ఏడాది రూ.538 కోట్లకు పెరిగింది. దీనివల్ల స్త్రీనిధి రుణాల డిమాండ్ కొంత తగ్గింది. గతంలో బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యం తక్కువగా ఉన్నపుడు స్త్రీనిధి రుణాలు ఎక్కువగా తీసుకునేవారు. అయినా కూడా మొండి బకాయిలను తగ్గించి ఈ ఏడాది అనుకున్నమేర రూ.79కోట్ల రుణాల పంపిణీకి కృషిచేస్తున్నాం. రుణాలు తీసుకున్న మహిళలు కూడా సద్వినియోగం చేసుకుని బాగుపడుతున్నారు.