రంగారెడ్డి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రంగారెడ్డి జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకను ఆడంబరంగా, జోష్‌ఫుల్‌గా జరుపుకొనేందుకు రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ క్లబ్ హౌజ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ఆనందంగా నిర్వహించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా కొన్ని వేదికలు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో డీజేలు, కమేడియన్ల షోలు, సంగీత విభావరీలు వంటి తదితర కార్యక్రమాలను నిర్వహించే పనుల్లో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అక్కడికి వచ్చే వారిని ఆకట్టుకునేలా వివిధ రకాల రుచులతో కూడిన డ్రింక్స్, శాకాహారం, మాంసాహారం వంటి వంటకాలను సిద్ధం చేస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, ఆదిబట్ల, మంచా ల, శంషాబాద్ మండలాల పరిధిలోని పలు వేదికలు కొత్త ఏడాదికి కొంగొత్తగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. చేవెళ్ల పరిధి లో పదికి పైగా ఫామ్‌హౌజ్‌లు వేడుకకు సన్న ద్ధం కాగా శంకర్‌పల్లిలో రెండు, షాద్‌నగర్‌లో రెండు, ఇబ్రహీంపట్నంలో మూడు, హయత్‌నగర్‌లో రెండు, ఆదిబట్ల, మంచాల, శంషాబాద్ మండలాల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున 2022కు ఘనంగా వీడ్కోలు పలికి ..నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి.
షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరు, కమ్మదనం ఫామ్ల్యాండ్స్ల్లోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్నింటికి స్థానిక అధికారు లు, పోలీసుల నుంచి అనుమతి రావాల్సి ఉం ది. రిసార్ట్స్‌ల్లో పలు రకాల లైటింగ్స్‌తో వచ్చే వారిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. నూతన సంవత్సర స్వాగత కార్యక్రమాలు రాత్రి 8 నుంచి మధ్య రాత్రి ఒంటి గంట వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని పలు వేదికల యాజమాన్యాలు ఫ్యామిలీలు, జంటలు, అడల్ట్స్, పిల్లలకు వివిధ ధరలను నిర్ణయించి సేవలను అందించనున్నాయి.
ఆరంభం అదిరేలా..
లాస్ట్ ఇయర్ మిస్ అయిన మామ.. ఈ సారి ఆ ప్రసక్తే లేదు. ఇయర్ ఎండ్ మస్త్ జోష్ ఉండాలె’ ఇద్దరు స్నేహితుల మాట..
అప్పుడు ఇద్దరమే ఉన్నాం.. ఇప్పుడు ముగ్గురమయ్యాం. సంబురాలు కూడా పెరుగాలి చూడు’ భర్తతో ఓ భార్య..
పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 30: పార్టీ.. పార్టీ.. పార్టీ.. ఎవరినోట విన్నా అదే మాట. ఏ నలుగురు కూర్చున్నా అదే ముచ్చట. అది ఇల్లయినా, బజారైనా అదే గుసగుస.. బంధులైనా, దోస్తులైనా అదే చర్చ. ఒక్కొక్కరు ఒక్కోలా కిరాక్‌గా ఇయర్ ఎండింగ్ పార్టీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురితో కలిసి జోష్‌గా ఎంజాయ్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. యూత్ మాస్‌గా సిద్ధమవుతుంటే.. ఫ్యామిలీస్ క్లాస్‌గా.. గేటెడ్ కమ్యూనిటీలు జోష్‌గా వేడుకలకు సిద్ధమవుతున్నారు.
నగర శివారులో నూతన సంవత్సర వేడుకలను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకొనేందుకు యువత సిద్ధమైంది. ఇప్పటికే స్నేహితులంతా ఒక్కచోటకు చేరి చర్చలు మొదలుపెట్టారు. 31వ తేదీ రాత్రి 7 గంటల నుంచే సంబురాలు మొదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సరైన చోటును ఎంపిక చేసుకున్నారు. డీజేలకు ఆర్డర్లు ఇచ్చేశారు. రాత్రి 12 గంటల వరకు ఎంజాయ్ చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫుడ్ మొదలు, కూల్‌డ్రింక్స్‌తోపాటు అంతా పక్కాగా సిద్ధం చేసేస్తున్నారు. పలుచోట్ల అదేరోజు రాత్రి వివిధ క్రీడా పోటీల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఆపై డీజే సౌండ్ల మధ్య స్టెప్పులతో అదరగొట్టాలని ప్లాన్ వేసుకుంటున్నారు. ఆపై కేకులు కట్ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఒక్క చోట చేరి.. సంబురాల్లో మునిగి తేలి..
గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఇయర్ ఎండింగ్ వేడుకలకు జోష్‌గా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. డిస్కో లైట్లు, డీజే సౌండ్ల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దగ్గర బంధువులను ఆహ్వానిస్తున్నారు. అంతా కలిసి సంతోషంగా న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. పిల్లలు డ్యాన్సులు, వివిధ ప్రోగ్రాంలు చేసేందు కు సిద్ధమవుతుంటే.. ఆతృతగా తిలకించేందుకు పెద్దలు ఉత్సాహం కనబరుస్తున్నారు.
కాలనీల్లో కలిసికట్టుగా..
నగర శివారులోని కాలనీల్లో న్యూఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రాత్రి 12 గంటల వరకు ఇండ్ల ముందు ముగ్గులు వేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆపై పిల్లా పాపలతో కలిసి కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీల అసోసియేషన్లు ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి.
ప్రత్యేక ఆఫర్లు..
నూతన ఏడాదిని కొత్తగా ప్రారంభించేలా పలు ప్రైవేట్ సంస్థలు, యాజమాన్యాలు ప్రజలను ఆకట్టుకునేలా పలు ఆఫర్లు ఇస్తున్నాయి. బిర్యానీ కేంద్రాలు, కేకులు తయా రు చేసే పలు బేకరీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గతంలో ఉన్న ధరల కంటే తక్కువకే అందిస్తున్నాయి.