జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా ఔటర్ రింగు రోడ్డు మారింది. భారీ ప్రాజెక్టులు, కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు చుట్టూనే ఎక్కువగా వెలుస్తున్నాయి. కొత్తగా వచ్చే సంస్థలు ఓఆర్ఆర్ను పరిగణలోకి తీసుకొని తమ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) గ్రేటర్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రోత్ కారిడార్ నిబంధనలను పక్కాగా అమలు చేసే చర్యలు చేపట్టింది.
– సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు నుంచి 15 మీటర్ల (50 ఫీట్) వరకు బఫర్ జోన్ ఏరియా ఉంటుంది. ఈ పరిధిలో నిర్మాణాలు చేపడితే వాటిపై వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రంగానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా బఫర్ జోన్ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలో కేవలం పచ్చదనం పెంపకానికి మాత్రమే అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ చార్జీల వసూలు రెండు రోజుల క్రితమే ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో ఇప్పటి వరకు దీనిపై పనిచేసిన అధికారులు ఇక నుంచి గ్రోత్ కారిడార్ అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి నుంచి నానక్‌రాంగూడ మీదుగా నార్సింగి, కోకాపేట, కొల్లూరు, మంచిరేవుల, తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంతాల్లో ఓఆర్ఆర్ చుట్టూ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతుండగా, మిగతా ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఓఆర్ఆర్ను కోర్ సిటీ నుంచి అనుసంధానం చేస్తూ 33 రేడియల్ రోడ్లు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, చుట్టూ ఉన్న ఇతర రాష్ర్టాలు, మెట్రో నగరాల నుంచి జాతీయ రహదారులు ఓఆర్ఆర్తో అనుసంధానమై ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఓఆర్ఆర్ నుంచి సిటీ లోపలికి వెళ్లాలన్నా, బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు మెరుగైన రోడ్డు మార్గాలు ఉండగా, వాటిని మరింతగా విస్తరించేందుకు హెచ్ఎండీఏ పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది. ముఖ్యంగా ఓఆర్ఆర్ ప్రధానరహదారి నుంచి ఇరువైపులా ఉన్న భూముల్లో గ్రోత్ కారిడార్ నిబంధనల్లో భాగంగా గ్రిడ్ రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పరిశ్రమలు, నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా అవసరమైన రోడ్ల నెట్ వర్క్‌ను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చినట్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఇలా దశల వారీగా గ్రేటర్ చుట్టూ ఉన్న 158 కి.మీ పొడవునా గ్రోత్ కారిడార్ అభివృద్ధికి హెచ్ఎండీఏ అధికారులు పనిచేయనున్నారు.
ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కలతో పాటు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన నిధులు సరిపడా ఉన్నాయి. ఇటీవల కాలంలో భూముల వేలం ద్వారా, ఓఆర్ఆర్ దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడంతో రూ.20వేల కోట్లకు పైగా ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరింది. ఇందులోనుంచి హైదరాబాద్ మహానగరాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నారు. దీనికితోడు ప్రతియేటా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల అనుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం గ్రేటర్ చుట్టూ ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఖర్చు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధి తర్వాత ఉన్న ప్రాంతంలో ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ జరిగేందుకు మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయడంతో పాటు కొత్తగా మౌలిక వసతులను కల్పించేందుకు హెచ్ఎండీఏ అధిక ప్రాధాన్యతనిస్తున్నది.
ముఖ్యంగా నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు ఔటర్ రింగు రోడ్డు ఇంటర్ చేంజ్ల సమీప ప్రాంతాల్లోనే శాటిలైట్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రోత్సహించనున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 20 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉండటంతో అక్కడ శాటిలైట్ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థతో పాటు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును ఔటర్ చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో అధికారులకు సూచించింది. దీంతో భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంట మెట్రోరైలు వస్తే శాటిలైట్ టౌన్‌షిప్పుల అభివృద్ధి మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా ఇప్పటి నుంచే హెచ్ఎండీఏ అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్కు ఇరువైపులా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువుల చుట్టు పక్కల ప్రాంతాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులనైనా చేపట్టడానికి వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చిన జోనింగ్ నిబంధనలను అనుసరించి ఆయా భూములను వినియోగించుకునే అవకాశం ఉంది. వాటికి అనుగుణంగా చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు వందల ఎకరాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఔటర్ రింగు రోడ్డు నుంచి కొత్తగా లింకు రోడ్డు నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీల నుంచి ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌లు, సర్వీసు రోడ్లకు అనుసంధానంగా రోడ్లను నిర్మించడంపై ప్రధానంగా దృష్టిసారించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా 100 అడుగుల విస్తీర్ణంతో కూడిన రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అత్తాపూర్, బుద్వేల్, కిస్మత్పూర్ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఆదేశాలివ్వడంతో రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టిన అధికారులు మొత్తం రూ.5.94 కోట్లతో హిమాయత్‌సాగర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు నుంచి కిస్మత్పూర్ వివేకానంద విగ్రహం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. ఈనెల 18 వరకు టెండర్లను స్వీకరించి అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసి పనులు అప్పగిస్తామని, మొత్తం రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు సుమారు 4 నెలల సమయం ఇస్తున్నామని అధికారులు తెలిపారు.