గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Oct 22, 2020 , 05:52:14

పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలి

పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలి

శేరిలింగంపల్లి: దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే. దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన పోలీసు అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు. భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వరద సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలను సైతం పణంగా పెడుతారన్నారు. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారని, అందుకు తగినట్లుగానే విధులు నిర్వహిస్తూ డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలు పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు 14 మందికి ఇటీవలే పలు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించామన్నారు. గాయపడిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. అనంతరం సైబరాబాద్‌ పోలీస్‌ సిబ్బంది కమిషనరేట్‌ నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, సైబరాబాద్‌ ట్రాఫిక్‌  డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఉమన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ అనసూయ, సైబరాబాద్‌ క్రైమ్స్‌ ఏడీసీపీలు కవిత, ఇందిరా, రామచంద్రుడు, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఏడీసీపీ మాణిక్‌ రాజ, సీఎస్‌డబ్ల్యూ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌ కుమార్‌, ఏడీసీపీ అడ్మిన్‌ లావణ్య ఎన్‌జేపీ, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీసీఆర్‌బీ ఏసీపీ రవిచంద్ర, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఏసీపీ సంతోష్‌కుమార్‌, సీటీసీ ఏసీపీ రమణారెడ్డి, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌, ఇతర ఏసీపీలు, హెడ్‌ క్వార్టర్స్‌ సిబ్బంది, లా అండ్‌ ఆర్డర్‌ ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్‌ సిబ్బంది, సీపీ ఆఫీస్‌ సెక్షన్ల సిబ్బంది, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ సిటిజన్స్‌ అనిపించుకోవాలి - రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

గోల్నాక: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించి ఫ్లెండ్లీ సిటిజన్స్‌ అనిపించు కోవాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పిలుపు నిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా అంబర్‌పేట కార్‌హెడ్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసు అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించి మేమున్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం విడిచిన అమర వీరుల త్యాగాలు మరవలేమన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత నిస్తుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో మనం దేశంలోనే ముందున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, డీసీపీలు రక్షితమూర్తి, సన్‌ప్రీత్‌సింగ్‌, నారాయణరెడ్డి, యాదగిరి, ఏసీపీలు సురేందర్‌, మనోహర్‌, వెంకటేశ్వర్లు, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.