మోదుగులున్న అడవి.. మొగుడున్న ఇల్లు ఒక్కటే
ఇంటికి మగతోడు అవసరాన్ని చాటిచెప్పే సామెత ఇది. వికలాంగుడో, అంధుడో.. ఎవరో ఒకరు, మగవాడైతే చాలన్నది పెద్దల అభిప్రాయం. ఇంట్లో భర్త ఉంటే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంటాడు. కష్టమైనా, నష్టమైనా ఎదుర్కొంటాడు. ఏ ఆపద వచ్చినా తనవాళ్ల కోసం నిలబడతాడు. వెరసి భర్త, భార్య, పిల్లలతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. మోదుగు చెట్టూ అంతే. ఎక్కడున్నా నిండుగా కనిపిస్తుంది. పైగా మోదుగు గింజ భూమిలో ఉంటే 50 ఏండ్ల తర్వాతయినా మొలకెత్తుతుందని అంటారు. అంతేకానీ కుళ్లిపోదు. కరువు కాటకాలను తట్టుకుని.. వర్షం పడగానే చిగురిస్తుంది. మోదుగుపూలతో అడవికే అందం వస్తుంది. అలాగే భర్త అనే తోడు ఉంటే.. ఒకనాటికి కాకపోయినా, ఇంకోనాటికైనా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. కుటుంబం సంతోషంగా ఉంటుందన్నది సామెత అంతరార్థం. ‘పిల్లలున్న ఇల్లు.. మోదుగులున్న అడవి ఒక్కటే’, ‘మోదుగులున్న అడవి.. మొగుడున్న ఇల్లు చెడిపోవు’ వంటి సామెతలు కూడా వ్యవహారంలో ఉన్నాయి.
మత్పరించుడులో తోపు!

మన చుట్టూ ఎంతోమంది మాయగాళ్లు. నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ.. నమ్మిస్తూ ఉంటారు. ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. అవకాశం దొరకగానే.. మన వస్తువులో, డబ్బులో, దుస్తులో మాయం చేస్తుంటారు. అదంతా వాళ్లపనే అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ ఉండవు, ఉంచరు కూడా. తీరిగ్గా ఆలోచిస్తే తప్ప అలాంటి వ్యక్తుల స్వభావం తెలియదు. ఇలాంటివాళ్లను ఉద్దేశించే ‘వాడు మత్పరించడంలో తోపు’, ‘మత్పరించడం వానికి వెన్నెతో పెట్టిన విద్య’, ‘వాణ్ని పక్కలేసుకుని తిర్గుతున్నవ్.. నిన్నే మత్పరిస్తడు పైలం’ అని హెచ్చరిస్తారు పెద్దలు. ‘మతకరి’ అంటే మాయావి అని అర్థం. ‘మతకరిచ్చుడు’ ‘అంటే మాయ, మోసం చెయ్యడం.‘మత్పరించడం’ అంటే కూడా తెలియకుండా మాయ చెయ్యడమే!
పొద్దుగాల వచ్చిన వాన.. పొద్దుగూకినంక వచ్చిన సుట్టం పోరట

సమయంగాని సమయంలో వచ్చింది ఏదైనా సరే.. వెంటనే వెళ్లదని, ఎక్కువ సమయం ఉండిపోతుందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. ఏ విషయంలోనూ తొందరపడకుండా, అనుకూల సమయం వచ్చేవరకూ ఆగాలని చెబుతుంటారు జానపదులు. తొందరపాటులో ఏ కార్యం మొదలుపెట్టినా మళ్లీ మొదటికే వస్తుందని హెచ్చరిస్తుంటారు. పొద్దుపొద్దున్నే వర్షం వస్తే.. ఆ రోజు చేయాల్సిన పనులన్నీ వాయిదా పడతాయి. ఏ వ్యవహారమూ ముందుకుపోదు. అదే రాత్రి వేళలో వర్షం కురిస్తే తెల్లవారే వరకూ సమస్య ఏమీ ఉండదు. అలానే పొద్దుగూకినంక (చీకటి పడేవేళ) వచ్చే చుట్టం కూడా అంతే. అప్పటికప్పుడు తిరిగి వెళ్లడు. ఆ రాత్రికి అతనికి ఇంట్లో వసతి ఏర్పాటు చెయ్యాల్సిందే. అలాగని రాత్రిపూట అతణ్ని పంపడమూ భావ్యం కాదు. ఆ పూటకు భరించడమే. అందుకే, పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు ఓపికతో వ్యవహ రించాలని చెబుతారు పెద్దలు.
అర్థ వివరణ

1. పాలియాల్ల = పిల్లలకు పాలిచ్చే సమయం (పనులకు వెళ్లిన తల్లులు పాలియాల్లకు ఇంటికొచ్చి చంటి పిల్లలకు పాలిచ్చేది. తర్వాత మళ్లీ పనికి వెళ్లేది. ఇప్పటికీ బాలింతలకు ఇలాంటి వెసులుబాటు ఉంది)
2. ఎకలెక పనులు = వెకిలి చేష్టలు (చాలు తియ్ నువ్వూ.. నీ ఎకలెక చేష్టలు. కొంచెమన్నా చిరాకు పెట్టదారా?)
3. పజీతు = అవమానం, పరువు తీయడం (ఇంట్ల ఉన్న సంసారాన్ని నడిరోడ్లబడేసి, నా పజీతు తియ్యొద్దు)
4. కంజీషుగాడు = పిసినారి (పోయిపోయి.. ఆ కంజీషుగాణ్నే అడిగినవా అప్పు!)
5. దంపులాడుడు = కొట్లాట/తన్నుకొనుడు (ఊరి చివరి చింతలల్ల రాజుగాడు, మల్లిగాడు దంపులాడుతుర్రు. ఒగల్లకు నెత్తురొస్తుంది. జల్దిరా నాయినా..)
…?డప్పు రవి
బొమ్మలు: మృత్యుంజయ్
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

