బతికి చెడినోడి బట్టలు చూడు.. చెడి బతికినోడి చేతులు చూడు
అనుభవాన్ని మించిన గురువు లేడంటారు జానపదులు. వాళ్లు పలికే ప్రతి మాటా అపార అనుభవంలోంచి వచ్చిందే.
అనుభవాన్ని మించిన గురువు లేడంటారు జానపదులు. వాళ్లు పలికే ప్రతి మాటా అపార అనుభవంలోంచి వచ్చిందే. కొందరంతే! ఎంత చెప్పినా వినరు. పరిస్థితి వివరించినా ససేమిరా అంటారు. అలాంటప్పుడే.. ‘బతికి చెడినోడి బట్టలు చూడు. చెడి బతికినోడి చేతులు చూడు’ అనే సామెత. ఒకప్పుడు బాగా బతికి, కన్నూమిన్నూ కానకుండా అందినన్ని అప్పులు చేసి, ఉన్నదంతా ఊడగొట్టుకొని, నలుగురిలో పరువు పోతుందేమోననే భయంతో.. తిండికి లేకపోయినా బట్టలు మాత్రం బాగా కడతారు. కచ్చితంగా అలాంటి వాడి డాబుసరి చూడాలట. ఇక చిన్ననాటి నుంచీ తప్పుదారి పట్టి, కాయకష్టం చేసి.. తప్పులు తెలుసుకొని ఏదో ఒకరోజు ఉన్నతస్థితికి వస్తారు కొందరు. అలా వచ్చినవారు మాత్రం ఎప్పటికీ తప్పు చేయరు. నిత్యం కష్టిస్తూనే ఉంటారు. కాబట్టే, వాళ్ల చేతులు కాయలుకాసి ఉంటాయి. కాబట్టే ‘బతికి చెడటం కన్నా.. చెడి బతకడం మేలు’ అన్నారు పెద్దలు. ‘బతికి చెడ్డోనికి మనాది లావు, చెడి బతికినోనికి చలాకి లావు’, ‘బతికి చెడ్డోని ఆట జూడు.. చెడి బతికినోని మాట విను’ తదితర సామెతలు కూడా తరచూ వినిపిస్తుంటారు.
తేరసొమ్ము బీరపీసు

‘వాడికి తేరగా అచ్చిన సొమ్మంటే బీరపీసు లెక్క’ అనే నానుడి నేటికీ వాడుకలో ఉంది. తేరగా (ఉచితంగా) వచ్చే సొమ్మును ఆశించే వాళ్లు చాలామందే ఉంటారు. కాబట్టి, తనదికాని సొమ్ము/ వస్తువు/ మద్యం/ మగువపై వ్యామోహం పెంచుకునే సందర్భంలో ‘తేరసొమ్ము బీరపీచు’ అంటూ పదునైన సామెతను ప్రయోగిస్తారు జానపదులు. వస్తువైనా, మద్యమైనా, డబ్బయినా.. తేరగా వస్తుందంటే చాలు బియ్యానికి వచ్చిన కాకిలా ఎదురుచూస్తుంటారు. బీరకాయలోని పీచులు ఒకదానితో ఒకటి గట్టిగా పెనవేసుకుని ఉంటాయి. ‘పరుల సొమ్ము’ పట్ల ఆశ అంతకంటే గట్టిగా పెనవేసుకుని ఉంటుందని జానపదుల భావన.
కుక్క పెత్తనం

‘ఎహే.. నువ్వొక్కన్వే పెద్దోనివని పెత్తనమిస్తే.. కుక్క పెత్తనం జేస్తున్నవ్ లే’ అంటారు ఊళ్ల పంచాయితీల కాడ. కొందరు పెద్దలకు పదవులు అధిష్ఠించాలని కోరికగా ఉంటుంది. అయితే.. వారి బుద్ధి మాత్రం శునకమంత హీనంగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు ఏమనుకుంటారో అనే జంకు లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. అలాంటివారిని ఉద్దేశించిన పలుకుబడి ‘కుక్కపెత్తనం’. కుక్క ఒకచోట ఉండే జంతువు కాదు. ఇల్లిల్లూ తిరుగుతూ ఉంటుంది. వీధినపోయేవారిని చూసి మొరుగుతూ ఉంటుంది. పిచ్చెక్కితే కరుస్తుంది. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు పెద్దరికం ఇస్తే.. ఊరంతా లొల్లి పెట్టుకుంటారు. ఆ అనుభవంలోంచి వచ్చిన పదబంధాల్లో ‘కుక్కతోక వంకర’, ‘కుక్కకు పెత్తనమిస్తే.. ఊరంతా కంపు చేసింది’,‘కుక్కను సింహాసనమెక్కిస్తే ఏం ఫాయిదా?’, ‘తోక తెగినా కుక్క కుక్కే..’ వంటివి ఉన్నాయి. మొదట్నుంచి కుక్కతోకను, దాని వక్రబుద్ధిని క్షుణ్ణంగా పరిశీలించే.. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ఆ పదాలను ఆపాదించారు పెద్దలు. అందుకే ఒక మనిషి తత్వం తెలుసుకోవాలంటే.. ముందు పెత్తనమిచ్చి చూడాలంటారు.
అర్థ వివరణ

1. మాట్లేసుడు = రంధ్రాలు పూడ్చడం (రాగిబిందె మోయలేక కిందపడేస్తివి. సొట్టబోయి, పొక్కలు పడె. మాట్లేసేటోళ్లు రాంగనే బిందె చూపించు. దగ్గరుండి మాట్లేయించు)
2. ఇంగటుకులు = ఇంగువతో వేయించే అటుకులు (ఎన్నాళ్లాయె ఇంగటుకులు తిని. సలికాలంల వేడివేడిగా వేయించి తింటే.. నా సామిరంగా..)
3. బొమ్మోలె ఉండటం = అందంగా, సుకుమారంగా ఉండటం (బొమ్మోలె ఉన్నదిర పోరి. మా బాపుకు చెప్పి లగ్గాలు పెట్టియ్యమని అడగాలె)
4. అడవిజేసుడు = అన్యాయం చేయడం (పోలీసు కేసుకు పోతానంటే ఊరుగొడ్డుపోలేదని సర్దిచెప్పిర్రు. పెద్దోళ్ల కాడికిపోతేనేమో నన్ను అడవిపాల్జేసిర్రు)
5. చిడాయించు =వెక్కిరించడం, ఎగ్గులు పెట్టడం (మొన్నట్నుంచి చూస్తున్నా.. నేను కనిపిస్తే చాలు చిడాయించుడు షురూ జేస్తున్నవ్. ఏంది కత? మా అయ్యకు చెప్పాల్నా?)
…?డప్పు రవి
బొమ్మలు: మృత్యుంజయ్
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

