కొందరంతే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. కారణం.. అనుభవ రాహిత్యం. దీనివల్ల నలుగురిలో అభాసుపాలవుతుంటారు. అలాంటివారిని ఉద్దేశించిన సామెత ‘అయింది అటకల.. కానిది కడవల పెట్టుడు’. ఏ పనీ చేయకుండానే.. ఇల్లు ఎలా గడుస్తుందో తెలియకుండానే పెరిగి పెద్దవుతుంటారు కొందరు.
అలాంటివారికి ఏదైనా పని చెబితే.. చేతగాక, చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఆ తిక మకలో నిత్యం అవసరపడే వస్తువులను అటకలపై దాస్తారు, ఇక ఎప్పటికీ అవసరం రాదనుకునే వస్తువులను చేతికి అందుబాటులో ఉండే.. కడవ(కుండ)లో వేస్తుంటారు. ఇదంతా చూసి.. ‘అయింది అటకల.. కానిది కడవల పెడుతడు. ఎట్ల బతుకుతడో ఏమో.. వీనితోని సావుమర్నం వచ్చిందిరా నాయనా’ అంటూ నెత్తీనోరు బాదుకుంటారు ఇంట్లోవాళ్లు.