ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ.. తన ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘షావోమీ-18 ఫోల్డ్’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పాత ‘మిక్స్ ఫోల్డ్’ బ్రాండింగ్‌ను పక్కనపెట్టి.. సరికొత్త డిజైన్, ఇన్-హౌస్ 3ఎన్ఎం ప్రాసెసర్, లైకా కెమెరా లాంటి అత్యాధునిక ఫీచర్లతో దీనిని రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ.. దీని వినూత్న ఫామ్ఫ్యాక్టర్. సాధారణ ఫోల్డబుల్ డిస్ప్లేలకు భిన్నంగా.. ఇందులో 2:1 యాస్పెక్ట్ రేషియోను అందిస్తున్నారు. బయట 5.38 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండగా, అన్ఫోల్డ్ చేసినప్పుడు 7.58 అంగుళాల ప్రధాన ఇన్నర్ డిస్ప్లే అందుబాటులోకి వస్తుంది.
డబుల్-లేయర్ అల్ట్రా థిన్ గ్లాస్, నెక్ట్స్ జెన్ డ్రాగన్ బోన్ హింజ్ వ్యవస్థ కారణంగా స్క్రీన్‌పై క్రీజ్ అతి తక్కువగా కనిపిస్తుంది. ఈ ఫోన్లో షావోమీ తన సొంత 3ఎన్ఎం ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన XRING O3 చిప్‌సెట్‌ను పొందుపరిచింది. ఈ ప్రాసెసర్ భారీ మల్టీ-టాస్కింగ్, గ్రాఫిక్స్ అవసరమైన గేమింగ్‌ను కూడా అవలీలగా నిర్వహిస్తుంది. దీనికితోడు మార్కెట్లోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన సరికొత్త LPDDR6 ర్యామ్ సాంకేతికత, UFS 4.1 స్టోరేజ్.. మరింత వేగవంతమైన అనుభూతిని అందిస్తాయి.
ఇక ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం జర్మన్ కెమెరా దిగ్గజం లైకాతో చేయి కలిపింది. అధునాతన ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ను అందిస్తున్నది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 200 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ (3.5x ఆప్టికల్ జూమ్)ను ఏర్పాటు చేశారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఇన్నర్, ఔటర్ స్క్రీన్లపై డ్యూయల్ 16 ఎంపీ కెమెరాలను అమర్చారు.
స్లిమ్ బాడీ ఉన్నప్పటికీ ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీనికి 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 6.0, డాల్బీ ఆట్మాస్ స్టీరియో స్పీకర్లు, వాటర్ రెసిస్టెన్స్ రక్షణ.. ఇలా మరెన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత HyperOS 4తో నడుస్తుంది. 12 జీబీ +256 జీబీ ప్రారంభ వేరియంట్ ధర సుమారు రూ.1,30,000గా నిర్ణయించగా, ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నది.