ఓయూ.. ఉస్మానియా విశ్వవిద్యాల యం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో అక్షరాల జల్లు కురిపించింది. ఆంధ్రా పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తిని చేయడంలో ముఖ్య భూమిక పోషించింది. అలాంటి వర్సిటీలో చదువుకోవాలనే కోరిక నాకు ఇంటర్‌లోనే కలిగింది. ఓయూలో చదివిన ఎంతోమంది విద్యార్థులు రాజకీయ నాయకులుగా, విప్లవకారులుగా, సినీ దర్శకులుగా, క్రీడాకారులుగా దేశానికి సేవ చేశారు. ఓయూ దేశానికి గొప్ప ప్రధానిని ఇచ్చింది, ఆయనెవ్వరో కాదు మన పీవీ నర్సింహారావు అని మా తెలుగు సార్ చెప్పడంతో ఆ కోరిక మరింత బలపడింది.
ఏ క్షణమైనా వాన కురుస్తుందేమో.. అన్నట్లుగా ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. చల్లని గాలి, ఎటు చూసినా పచ్చని మొక్కలు, పావురాల గుంపులు, పచ్చదనాల మధ్య నాకు ఓయూ స్వాగతం పలికింది. ఆ క్షణం సేదతీర్చే సహచరునిగా, ఆప్యాయంగా అక్కున చేర్చుకునే తల్లి ఒడిలా అనిపించింది. ఆ క్షణంలో నా కళ్ళకు, ప్రకృతి అభిషేకిస్తున్న సరస్వతి నిలయంగా కనిపించింది ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ.
యూనివర్సిటీ నాకు ఎంతో మంది మిత్రులను పరిచయం చేసింది. నాగరికతకు నడకలు నేర్పే ప్రదేశంగా, విద్యా కుసుమాలు వికసించే ఉద్యానవనంగా, నిరక్షరాస్యతను పారద్రోలి అక్షరజ్యోతులను వెలిగించే పవిత్ర దేవాలయంగా కనిపించింది ఓయూ మెయిన్ లైబ్రరీ. ఇది పుస్తకాలతో కుస్తీ పడే ప్రాంతం. పల్లెటూరు నుంచి విద్యార్థిగా వచ్చినవారికి ఎలా చదువాలో, ఎలా పోటీపడాలో నేర్పించి ఉద్యోగిగా బయటకు పంపే వేదిక ఈ మెయిన్ లైబ్రరీ. ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఓయూలో ప్రత్యేక ప్రాంతం. ఇందులోని ప్రతి చెట్టుకో చరిత్ర ఉంటుంది. పుస్తకాలతో కుస్తీ పడి అలసిపోయిన తన బిడ్డలకు చల్లని గాలినిస్తూ, చిక్కని నీడనిస్తూ తల్లి వలె లాలిస్తుంది. ఎటుచూసినా పచ్చని మొక్కలు, పూల సువాసన.. స్వర్గంలోని ఇంద్రవనం ఇక్కడికివచ్చి ఓయూలో కొలువై ఉన్నట్లుగా ఉంటుంది.
గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్లు, జాగింగ్లు చేస్తూ జాతర జరుగుతుందా అన్నట్లుగా జనసందోహంతో కళకళాడుతూ ఉంటాయి యూనివర్సిటీ మైదానాలు. ఎస్ఐ, కానిస్టేబుల్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే గురువుగా, తప్పు చేస్తే శిక్షించే తండ్రి వలె, ఎందరో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రక్షక భటులుగా తయారుచేసి మురిసిపోతూ ఉంటాయి ఆ మైదానాలు. చుట్టూ ఉన్న జనానికి ఆరోగ్య సూత్రాలు చెప్పే డాక్టర్ ఉస్మానియా యూనివర్సిటీ. మట్టి వాసన పరిమళాలను వెదజల్లుతూ ఆక్సిజన్‌ను అందించే ఆరోగ్య కేంద్రం ఓయూ.
పలు భాషలు, భిన్న సంస్కృతులు, విభి న్న ఆచారాలు, అనేక రకాల ధోరణులు కలిగి న విద్యార్థుల సమూహం ఓయూ. ఇందులో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి తన కులమతాలను మరిచిపోయి సోదరభావాన్ని కలిగి ఉంటారు. అందుకే ఓయూ మినీ భారత్‌లా కనిపిస్తుంది. సర్పంచి నుంచి ప్రధాని దాకా, సాధారణ ఉద్యోగి నుంచి గవర్నర్ దాకా ఇందులో చదివినవారున్నారు. ఓయూ విద్యార్థులు ఎన్నోరకాల పదవులు అలంకరించి, ఆ పదవులకూ వన్నె తీసుకువచ్చినవారే. ప్రస్తు తం 83 దేశాల విద్యార్థులు ఓయూలో విద్య ను అభ్యసిస్తున్నారు. పలు భాషలు, రకరకాల సంసృ్కతులను తేజోవం చేసి సూర్యు ని వలె ప్రకాశిస్తున్న అక్షరజ్యోతి నా ఉస్మాని యా యూనివర్సిటీ.
విద్యను అందించటమే కాదు, ఉద్యమ ధైర్యాన్నీ నూరిపోస్తుంది మా ఓయూ. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకై నిలబడుతుంది మా ఓయూ. ఏ ఉద్యమానికైనా పునాదిరాళ్లు పేర్చి ఉసిగొల్పిన చరిత్ర ఓయూది.
‘తెలంగాణమే విడికాకుంటే అంతా ఆంధ్రుల దాసులమే/ తెలంగాణమే విడికాకుంటే ఇతరుల దృష్టికి నీచులమే/ అంబరాలు దద్ధరిల్ల పులిగర్జన చేయండి, పొలి కేకలు పెట్టండి/ ఉరుములోన కొస ఊపిరి ఉన్నదాక పోరాడండీవిజయలక్ష్మి వరిస్తుంది, విజయలక్ష్మి వరిస్తుంది..’
అన్న అనుముల శ్రీహరి మాటల వలె ఓయూ బారికేడ్లకు, బాష్పవాయువు గోళాలకు అదరలేదు, బెదరలేదు. తెలంగాణ తల్లి విముక్తి కోసం తన బిడ్డలకు పోరాడే తత్వాన్ని, ఎదిరించే ధైర్యాన్ని నూరిపోసింది. ఉద్యమ సమయంలో తన పొత్తిళ్లలోని చెట్లకొమ్మలకు ఉరితాడై వేలాడిన తన బిడ్డలను చూసి కడుపుకోత అనుభవించింది నా ఓయూ. తెలంగాణ ఉద్యమం సాగినంతకాలం వేగు చుక్కై నిలబడ్డది నా ఉస్మానియా యూనివర్సిటీ.
(వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్ (తెలుగు), ఓయూ)
-దుర్గం వెంకన్న
62816 24720