యాదాద్రీశ కృపా వివర్ధిత యశోహాస ప్రభారాశితో
నాదోత్తుంగ తరంగ సంఘటితమై నానా విధానోద్ధతిన్
మోదానందము చిందువేయు మహియై మూర్తీభవద్రత్నమై
మేదిన్యుల్ల సదాదృత ప్రజలతో మిన్నంటె సంవృద్ధిలో!
శిల్పకళా రహస్యముల జీవనలక్ష్యము తేటతెల్లమై
యల్పముగాని చాతురిని హద్దులు లేని పురోగతిన్ సదా
కల్పిత భాగ్యరేఖలను కాంక్షలనిండిన గమ్యసీమలన్
నిల్పిన రమ్యరాష్ట్రమున నిత్యము వెల్గుల వెల్లువే కదా!
వనములు, సుందరీకృత నివాస పథమ్ములు, స్వచ్ఛతాప్తిలో
ఘనములు, పైరు పంటలకు కట్టిన కోశములై గృహమ్ములన్
కనపడు సంపదల్, విరియగాచిన కామనల ప్రతీతమై
యనుపదమీ ధరిత్రి శుభమందుచు నిల్చినదెల్లవేళలన్!
దారులు పూలతేరులయి, తావులు నింపును నేత్రశోభలన్
తేరులవోలె రమ్యపథ దీప్తుల నింపుచు సాగిపోవగా
మారిన గ్రామశోభ, నవ మంజులతాళిని కుంజమై, మనో
హారిణి రాష్ట్రశోభ జనహాస వికాస విలాసమయ్యెడిన్!
చెరువులలోన దీరిన ప్రచేతన నిర్మల పూర్ణకుంభమై
తరువులలోన దీరిన విశిష్ట హరిద్ఘన కాంతి నిండగా
కరువులు లేని సంపదల కల్పవృక్షముగా సురాష్ట్రమై
నిరతము వెల్గులీను నవనిన్ తెలగాణము రాణకెక్కుచున్!
నవనవశోభతో సకల నందనసీమల గుర్తుసేయుచున్
నవపరిభావి వర్షముల నాటుచు వైభవమెల్ల చోటులన్
భువి వెలుగొందుచున్నది యపూర్వజనాభ్యుదయ ప్రచోదనన్
శివపథ మందు భాగ్యముల జేర్చుచు కూర్చుచు కాంతిరేఖలన్!
చరితలలోన మేలిమి విశాల యశస్సులు దీర్చి, కాకతీ
యరమకు వన్నెలద్దినది హర్షతరంగిత సంస్కృతి ప్రథన్
సురనర కోటికీ యవని సుందర దృశ్య మనోభిరామమై
గరగరలాడ నందములు కాంచన తోరణశౌర్య భూమియై!
పరిమళమోప్పు నాగరిక వైభవమెల్లెడ గానుపించు, సం
భరిత మృదూక్తులన్ వెలయు వాణి వినంబడునెల్ల చోటులన్
మురిపెములొప్పు భిన్నతకు పూచిన యైక్యత శాంతి నింపగా
స్థిరవరణీయ పాలనము చేతనమై ధనమై వెలింగెడిన్!
ఘన గోదావరి కృష్ణగాన ఝరిలో గర్వించు మంజీరతో
ననునిత్యమ్ము సుధామయాంబువులతో నాహ్లాదితారామమై
నినదించున్ తెలంగాణ పుణ్యవనమై నిండార గేహమ్ములన్
ధనధన్యామ్ములు క్షేమసంగతులు నిధ్వానించి రంజిల్లెడిన్!
దశమ వసంత వేళ, నవ జనతా ఘనతా ప్రదీప్తితో
కుశల పథాన సాగు, మణికోశము రాష్ట్రము భారతావనిన్
యశముకు నిల్పుచున్నది ప్రయాణము సేయుచు నుజ్జలమ్ముగా
విశద పురోగమ ప్రభల వేదికయై జనతాభిరామమై!
డాక్టర్ అయాచితం , నటేశ్వరశర్మ
94404 68557