చిందరవందరైన బతుకుల మధ్య
కాలువలై పారుతున్న కన్నీటిధారలు
వారి ఆర్తనాదాలు
కొందరి చెవులకు వినబడటం లేదు
అనాథల పక్షాన..
ఆకలి బాధితుల పక్షాన
నిలువాల్సిన పాలకులు
కన్నుల్లో ఒత్తులేసుకుని చూసినా
కనబడటం లేదు!
అటు చూడండి..
పేదల ఇండ్లను
నేలమట్టం చేసిందెవరో
రోడ్ల మీద న్యాయం కోసం
దుఃఖగీతికలై కరిగిపోతున్నారు!
బుల్డోజర్ వేటుకు
నేలపాలైన బతుకులు
పేదలనంతా
చెరబడుతున్నది పెట్టుబడి
వాళ్ల ఆక్రందనలు
ఆకాశానికి మిన్నంటిన
పాలకుల చెవులకు తాకడం లేదు
ఎక్కడో భూమి పొరల్లో దాగిన
చేదు నిజం మొలకెత్తింది
అప్పుడు సర్కార్ దిగొచ్చింది
ఏడ్చిన కన్నులను తుడుస్తున్నది!
విద్యుత్తు ప్రవహించే నరాల్లో
సత్తువ కనబడుతున్నది
ఆలోచనల్ని ఘాటెక్కించి
ఆచరణగా మార్చిన పెన్నులు
అన్యాయాల్ని బోనెక్కించి
ఆయుధానికి అఆలు
నేర్పించిన చేతులు
నీడను చూసి
భయపడుతున్నవి!
పేదల ఇండ్లు కూల్చి
పందిరేస్తున్న ప్రభుత్వం
ప్రజాపాలన పేరుతో
తుగ్లక్ పాలన చేస్తున్నది!
-ఎదిరెపల్లి కాశన్న