Holi Celebrations | నిజాంసాగర్, మార్చి 4: చుట్టూ జనం కేరింతలు.. దద్దరిల్లేలా బాజా భజంత్రీల చప్పుళ్లు.. నువ్వా.. నేనా అంటూ సవాల్.. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగించే ఆట కుస్తీ పోటీలు. క్రికెట్, ఫుట్బాల్ వంటి టోర్నీలు జరుగుతుంటే టీవీలకు అతుక్కుపోయే నేటి రోజుల్లోనూ కుస్తీ పోటీలకు క్రేజ్ తగ్గలేదు. పల్లెల్లో పండుగల సీజన్ వచ్చిందంటే చాలు కుస్తీ పోటీల సందడి మొదలవుతుంది. కుస్తీ పోటీలంటే జుక్కల్ నియోజకవర్గానికి పెట్టింది పేరు. ఏ మారుమూల గ్రామాన కుస్తీపోటీలు జరిగినా స్థానికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్లయోధులు వచ్చి పాల్గొంటారు. పల్లెల్లో సంక్రాంతి పండుగతో ప్రారంభమయ్యే కుస్తీ పోటీలు హనుమాన్ జయంతి వరకు రోజుకోచోట జరుగుతాయి.
గ్రామాల్లో కుస్తీ పోటీలంటే ఆట కాదు.. అదో పండుగ. గ్రామ దేవతలకు బోనాలు, మొక్కులు, జాతరలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కుస్తీపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందుకోసం గ్రామాభివృద్ధి కమిటీలు, పాలకవర్గాలు విరాళాలు సేకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. అంగళ్లలో చాటింపు వేసి మరీ కుస్తీ పోటీలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తారు. రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న యువత సైతం అవన్నీ పక్కన పెట్టి కుస్తీ పోటీలను తిలకిస్తున్నారంటే ఆ క్రీడకు గ్రామాల్లో ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. దూర ప్రాంతాల నుంచి సైతం అభిమానులు పోటీలను తిలకించేందుకు తరలివస్తారు.
పల్లెల్లో ఏటా సంక్రాంతి నుంచి జాతరలు ప్రారంభమవుతాయి. శ్రీ రామనవమి, హనుమన్ జయంతి, ఉగాది వంటి ప్రధాన పండుగలతోపాటు గ్రామ దేవతలకు బోనాలు, ఆలయ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఒక్కో గ్రామంలో మూడు రోజులపాటు పెద్ద ఎత్తున జాతరలు కొనసాగుతాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గ్రామ దేవతకు బోనాలు, మొక్కుల చెల్లింపు, ఎడ్లబండ్ల ఊరేగింపు వంటివి నిర్వహిస్తారు. చివరి రోజున ముగింపు సందర్భంగా కుస్తీపోటీలను ఏర్పాటు చేస్తారు. ఊళ్లో జాతర ఉందంటే గ్రామస్తులు వారి బంధుగణాన్ని ఇంటికి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా విందులు, వినోదాలతో ప్రతి ఇల్లూ సందడిగా మారుతుంది. చిన్నాపెద్ద, ఆడామగ తేడా లేకుండా జాతరలో సామగ్రి, తినుబండారాలు కొనుగోలు చేస్తారు. ఉత్సాహంగా కుస్తీపోటీలను తిలకిస్తారు.
కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు స్థానికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం మల్లయోధులు తరలివస్తారు. కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమయ్యే ఈ పోటీలకు ప్రోత్సాహక బహుమతి కింద పది రూపాయల నుంచి పదివేల దాకా అందజేస్తారు. చివరి కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ. ఐదువేలు, పదివేలు, వెండితో చేసిన కడియాలను బహూకరిస్తారు. కుస్తీపోటీల్లో పాల్గొనేవారు అక్కడ ఏర్పాటుచేసిన బరిలో కూర్చుంటారు. సరైన ప్రత్యర్థి ముందుకువస్తే నిర్వాహకుల అనుమతితో పోటీలో దిగుతారు. గెలిచినవారికి బొట్టుపెట్టి నగదు బహుమతిని అందజేస్తారు. గెలిచినవారిని హీరోల్లా చూస్తారు. పేరుగాంచిన మల్లయోధులు తలపడుతుంటే రెప్పవాల్చకుండా తిలకిస్తారు. రెండేండ్ల క్రితం పలుచోట్ల నిర్వహించిన కుస్తీపోటీల్లో దెగ్లూర్కు చెందిన ఓ యువతి పాల్గొని పురుషులను మట్టికరిపించిన విషయం జిల్లా ప్రజలకు గుర్తుండే ఉంటుంది.
కుస్తీ పోటీలంటే ఎక్కడాలేని హుషారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి చూస్తాం. చిన్నప్పుడు నేను కూడా కుస్తీపోటీల్లో పాల్గొనేవాడిని. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదు.. అదొక ఆనందం. మహారాష్ట్ర ప్రాంతం నుంచి బలమైన మల్లయోధులు వచ్చి పోటీ పడతారు. వారు కుస్తీ పడుతుంటే జనమంతా ఆసక్తిగా చూస్తారు.
-సురేశ్, మద్నూర్
టీవీల్లో ఎన్ని ఆటలు వచ్చినా పల్లెల్లో కుస్తీ పోటీలు ఉన్నాయంటే ఆ మజానే వేరు. ఎక్కడెక్కడి నుంచో కుస్తీపట్టేందుకు వస్తారు. జనం కూడా అంతే ఆసక్తిగా పోటీలు చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. మా ప్రాంతంలో కుస్తీపోటీలు ఎక్కడ జరిగినా వెళ్లి చూస్తాం. గ్రామాల్లో జాతర, కుస్తీపోటీలు ఉన్నాయని ప్రకటించిన నాటినుంచి ఉత్సాహంగా ఎదురుచూస్తాం.
-నరేశ్, గున్కుల్
కుస్తీపోటీలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ పోటీలు జరిగినా కుటుంబంతో సహా వెళ్లి చూసొస్తాం. చిన్నప్పుడు ఎంత దూరమైనా నడుచుకుంటే వెళ్లేవాళ్లం. ఎంత రాత్రివరకైనా సరే చివరి కుస్తీపోటీ కూడా వదిలిపెట్టకుండా చూసేటోళ్లం. అవసరమైతే అక్కడే తెలిసినవాళ్ల దగ్గర పడుకొని పొద్దున్నే ఇంటికి చేరుకునేది. మావూళ్లో జాతర ఉంటే చుట్టాలందరినీ ఆహ్వానిస్తాం.
-బస్వారాజ్, మేనూర్