ఖలీల్‌వాడి, డిసెంబర్ 2: విద్యార్థినులు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నగరంలోని మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరమణ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాలికలు ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్.. శుక్రవారం పాఠశాలకు వెళ్లి వక్రబుద్ధి ఉపాధ్యాయుడిని చితకబాదారు.
తల్లిదండ్రులతో పాటు విద్యార్థినులు సైతం వెంటబడి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన గురువు ఇలా ప్రవర్తించడంపై ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వెంటరమణను సస్పెండ్ చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.