వినాయక్‌నగర్, మే 5: నగరంలోని కొందరు ఆటోవాలాలు ట్రాఫిక్ నిబంధనలు, పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కుతున్నారు. తమకు నిబంధనలు వర్తించబోవనే రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులను చేరవేసే ఆటోలు పోలీసులు సూచించిన మేరకు పోలీసు రిజిస్ట్రేషన్ (టాప్) నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు ఆటో డ్రైవర్లు పోలీసు రూల్స్‌తో తమకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండానే తిరుగుతున్నారు. గతంలో పోలీసు అధికారులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ప్రతి ఆటో డ్రైవర్ పొందాల్సి ఉంటుంది. వారు జారీ చేసిన టాప్ నంబర్‌ను ఆటో వెనకాల అతికించి వాహనం నడపాలనే నిబంధనలు ఉన్నా యి.
కానీ కొంత మంది ఆటో డ్రైవర్లు పోలీ సు రిజిస్ట్రేషన్ మాట దేవుడెరుగు అన్నట్లుగా వ్యవహరిస్తూ పలు కంపెనీల ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర స్కీములకు సంబంధించిన స్టిక్కర్లను ఆటో టాప్ వెనకాల పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచార పోస్టర్లు వేసుకుంటే వారికి రోజువారీగా రెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నారు. దీంతో పలువురు ఆటో యజమానులు పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్లను పక్కన పెట్టి, కంపెనీలు, షో రూంల ప్రచార పోస్టర్లను ఆటోల వెనకాల పెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఏవీ?
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా కేవలం డబ్బుల కోసం ప్రచార పోస్టర్లను అతికించుకొని నగరంలో తిరుగుతున్న ఆటోలు ట్రాఫిక్, సివిల్ పోలీసులకు కనిపించడంలేదా అనే ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి. నిత్యం ఉద యం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ చేపడుతున్న పోలీసులకు నిబంధనలు పాటించకుం డా తిరుగుతున్న ఆటోలు కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా రూల్స్ పాటించకుండా తిరుగుతున్న ఆటోవాలాలపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.