బాన్సువాడ టౌన్, నవంబర్ 25 : బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం.. ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు వరంగా మారింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి సహకారంతో క్రీడాకారులకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. స్టేడియంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో వివిధ క్రీడాంశాల్లో శిక్షణకు అనువుగా మారింది. దీంతో ఇక్కడ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కోచ్‌లు కూడా మొగ్గు చూపుతున్నారు. స్టేడియంలో విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో సైతం శిక్షణకు వీలుగా మారింది. ప్రస్తుతం స్టేడియంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 20 మంది వాలీబాల్ క్రీడాకారిణులకు శిక్షణ కొనసాగుతున్నది. 22వ తేదీన ప్రారంభమైన శిక్షణ నేటి(శనివారం)తో ముగియనున్నది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మందిని ఈ నెల 27 నుంచి వేములవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.
క్రీడాకారులను తయారు చేసే కర్మాగారం కావాలి..
గతంలో ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా సరైన శిక్షణ, సౌకర్యాలు లేక రాణించలేకపోయారు. కానీ బాన్సువాడలో మినీ స్టేడియం నిర్మించిన తర్వాత చాలా మంది క్రీడాకారులు తయరవుతున్నారు. రాబోయే కాలంలో బాన్సువాడ స్టేడియం క్రీడాకారులను తయారు చేసే ఒక కర్మాగారం కావాలన్నదే నా ఆకాంక్ష.
-పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్
ఏకాగ్రతతో శిక్షణ
క్రీడాకారులకు ఇక్కడ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో వారు ఏకాగ్రతగా శిక్షణను కొనసాగిస్తున్నారు. క్రీడాకారులకు అనువైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినందుకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు
-కే సురేందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వాలీబాల్ హెడ్ కోచ్
జాతీయస్థాయిలో ఆడడమే లక్ష్యం..
క్రీడారంగంలో రాణించాలంటే తల్లిదండ్రులతో అందరి సహకారం అవసరం. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉండడంతో మా తల్లిదండ్రులు ఇక్కడ శిక్షణకు పంపించారు. శిక్షణ శిబిరానికి వచ్చిన మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ జట్టులో ఆడడమే నా లక్ష్యం.
-అఖిల, వాలీబాల్ క్రీడాకారిణి, జక్రాన్‌పల్లి
బాలికల శిక్షణకు అనువైన ప్రదేశం
బాలికలు క్రీడా కారులుగా రాణించాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అన్ని రకాల వసతులు ఉంటే కానీ వారు ఉండలేరు. ఇక్కడ బాలికలకు ఎంతో అనువైన ప్రదేశం కావడంతో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి.
– ప్రియాంక, పీఈటీ