శక్కర్‌నగర్, సెప్టెంబర్ 2: ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చాడో వృద్ధుడు. నడవలేని స్థితిలో ఉన్న ఆ పెద్దాయన కోర్టు హాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన న్యాయమూర్తి నేరుగా ఆయన వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. బోధన్ కోర్టులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బోధన్ న్యాయస్థానంలో ఓ కేసు విచారణలో భాగంగా సాక్ష్యం చెప్పేందుకు అశోక్ మిర్యాల్కర్ అనే వృద్ధుడు కోర్టుకు వచ్చాడు.
కోర్టు మెట్లు ఎక్కి హాల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్న ఆయనను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఇసంపల్లి సాయిశివ గమనించారు. బయట హాలులో ఉన్న ఆ పెద్దాయన వద్దకు వచ్చి.. కేసుకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. న్యాయమూర్తి మానవతా దృక్పథంతో కోర్టు బెంచ్ నుంచి దిగి వచ్చి వృద్ధుడితో మాట్లాడిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.